nizamabad mp kavitha
-
బాసర ఆలయ అభివృద్ధికి రూ.125 కోట్లు
నిర్మల్: బాసర ఆలయ అభివృద్ధికి రూ.125కోట్లతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న కవి సమ్మేళనంలో భాగంగా ఆమె ఆదివారం బాసరకు వచ్చారు. ఈసందర్భంగా బాసర సరస్వతీ దేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రూ.125 కోట్లతో ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని త్వరలోనే సీఎం కేసీఆర్ బాసరలో పర్యటించి, అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. -
ఓటుకు కోట్లు కేసులో రాజీ లేదు
కొమ్మినేని శ్రీనివాసరావుతో నిజామాబాద్ ఎంపీ కవిత మనసులో మాట పాలన ప్రజల వద్దకు వెళ్లాలి అంతే కాని ప్రజలు నావద్దకు రావడం ఏమిట న్నది కేసీఆర్ సిద్ధాంతం. ప్రజల బాధలు తీరిపోవడం కిందిస్థాయిలో జరిగి పోవాలి. అంతేకానీ, సమస్యల పరిష్కారం కోసం అక్కడి నుంచి ఖర్చులు పెట్టుకుని సీఎంని కలవడానికి హైదరాబాద్‌కు రావలసిన పనిలేదనే ఉద్దే శంతోటే చిన్న జిల్లాలను ఆయన ఏర్పాటు చేశారు. రాజకీయాల్లో పదవులు, వారసత్వాలు శాశ్వతం కావని, ప్రజలకు ఏం చేశామన్నదే వాళ్లు మనల్ని గుర్తుపెట్టుకునేందుకు గీటురాయి అని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంటున్నారు. తెలంగాణలో దొరల పాలన, కుటుంబ పాలన సాగుతోందంటున్నవారు నెహ్రూలు, గాంధీల నుంచి బాబుల దాకా సాగుతున్న చరిత్రను చూసి మాట్లాడాలని ఆమె ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసు లీగల్ వ్యవహారం. దాని పద్ధతిలో అది నడుస్తూనే ఉంటుంది కానీ ఎప్పుడు తేలు తుందో చెప్పలేమన్నారు. చంద్రబాబు ఎందుకు హైదరాబాద్ వదలి వెళ్లారన్నది వారి సమస్యే కానీ టీఆర్ఎస్ సమస్య కాదన్నారు. అన్ని ఫిరాయింపులూ ఒకటి కాదని, తెలంగాణలో బలమైన శక్తిగా టీఆర్ఎస్ నిలబడాలనే భిన్న వర్గాల నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని సమర్థించుకున్నారు. తెలంగాణ నేపథ్యం తెలియనివాళ్లలాగా విమర్శ చేస్తున్న కోదండరామ్ వైఖరి పట్ల ఉద్యమకారులుగా బాధపడుతున్నామే తప్ప ఆయనతో శత్రుత్వం లేదని, టీఆర్ఎస్కు ఆయన సహజమిత్రుడన్నారు. ఏపీతో రాజకీయంగా కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఏ పరిస్థితుల్లోనూ పోల్చుకోకూడదని ఎంపీ కవిత మనసులో మాటలో చెప్పిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... సాక్షి పాఠకుల తరపున స్వాగతమండీ. మీ చిన్న నాటి అనుభవాలు చెప్పండి? ఈ ప్రోగ్రాంకు నన్ను ఆహ్వానించినందుకు మీకు, సాక్షి టీవీ వారికి మనఃపూర్వక కృతజ్ఞతలు. చాలా తక్కువమంది అదృష్ట జాతకుల్లో నేనొకరిని అని చెప్పవచ్చు. బాల్యం నుంచి మహిళల వ్యక్తిత్వాన్ని ప్రోత్సహించే కుటుంబంలో పుట్టాను. నేనూ, అన్న... తొలినుంచి స్వతంత్ర వ్యక్తిత్వంతో పెరిగాం. మీకు బాగా సంతోషం కలిగించిన ఘటన ఏది? పెద్దకొడుకు పుట్టినప్పుడు ఆ సన్నివేశం అలా గుర్తుండిపోయింది. ఆ అనుభవం తొలిసారి కదా. అదొక సుందర క్షణం. బాగా బాధ కలిగించిన సన్నివేశం ఏది? నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. తనకు గుండెపోటు వచ్చింది. చాలా బాధేసింది. తర్వాత నాన్న దీక్ష చేసినప్పుడు కూడా భయంకరమైన హింస. ఒకవైపు ఉద్యమంలో చిన్న వయసు పిల్లలు చనిపోవడం, నాన్న అరెస్టు కావడం, ఉద్యమం ఏమవుతుందో తెలీదు. అలాంటి సమయం శత్రువులకు కూడా రాకూడదు. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర? 2006 డిసెంబర్లో కేసీఆర్ తొలిసారి రాజీనామా చేసిన రోజే నేను తొలిసారిగా బయటకు వచ్చాను. అప్పుడే తెలంగాణ పల్లెల్లో పేదరికం చూసి చాలా ప్రభావితం అయ్యాను. మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అన్ని రకాలుగా చదువుకుని మనం ఇంట్లో కూర్చుంటే ఎలా? మనమే ఏదో ఒకటి చేయాలి అనే ఉత్తేజం వచ్చింది. కేసీఆర్ పాలనపై మీ అభిప్రాయం? అయనలోని అంకితభావం నాకు నచ్చుతుంది. ప్రజలకు తాననుకున్నది చేయాల నుకోవడం, అమలు చేయడంలో నిబద్ధత వల్లే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, కొంత జాప్యం జరిగినా కమిట్మెంట్ వల్లే 90 శాతం పనులు ఆయన చేయగలిగారు. తెలంగాణ వచ్చాక 3 సంవత్సరాలకు నిరం తర కరెంటు ఇస్తానని చెప్పారు. కరెంటు వంటి క్లిష్టతరమైన విషయాన్ని అర్థం చేసు కుని, మూడే మూడు నెలల్లో 24 గంటల కరెంటు ఇచ్చారు. బ్రహ్మదేవుడు కూడా బాబును కాపాడలేడన్న కేసీఆరే రాజీపడ్డారా? కాంప్రమైజ్ అని నేననుకోను. ఒక వేళ నిజంగా అంత సీరియస్ టాక్ ఉంటే దాన్ని మేం పెద్ద విజయం కిందే భావిస్తాం కదా. కొన్ని కేసులు లీగల్ ఇష్యూలుగా మనం ప్రారంభించేంత వరకే మన చేతిలోఉంటాయి. చేసింతర్వాత లీగల్ వ్యవహారాలు ఎలా సాగుతుంటాయో మీకు తెలుసు. మనం తొందరపెట్టినంత మాత్రాన కొన్ని కేసులు పరిష్కారం కావు. తొందర పెట్టనంత మాత్రాన పరిష్కారం కాకుండా ఉండవు. లీగల్ క్రమంలో కేసు ఎప్పుడు తేలుతుందో తెలీదు కదా. ఆ కేసులో ఇబ్బందిలో ఉన్నది మా ప్రత్యర్థే కదా.. వాళ్లను రక్షించుకుని మేం సాధించేదేముంది? పైగా అలాంటి తెరవెనుక చర్యలు కేసీఆర్ ఎప్పుడూ చేయరు. బాబు ఎందుకు హైదరాబాద్ వదలి వెళ్లారన్నది ఆయన సమస్య. నిజానికి ఆయన అక్కడికి వెళ్లటం అనేది మంచిది. అక్కడ ప్రజలకు దగ్గరగా పాలన ఉంటుంది. అక్కడే ఉంటే పాలన మరింత వేగంగా జరుగుతుంది. ఫిరాయింపులు అనైతికమా కాదా? సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది మరి? తెరాస ఎన్నికల్లో గెలిచాక పెట్టిన తొలి ప్రెస్ మీటింగులోనే ఇవ్వాళ్టినుంచి మేం ఫక్తు రాజకీయ పార్టీగా ఉంటాంమని కేసీఆర్ చెప్పారు. ఎందుకంటే, తెలంగాణలో ఒక బలమైన రాజకీయ శక్తి అవసరం ఉంది. అది తెరాసే కావాలి. తెలంగాణలో ఒక శక్తి బలంగా ఎదిగి అభివృద్ధి చెందితే చూడలేని శక్తులు కూడా ఉన్నాయి. రాష్ట్రం ఇలాగే ఉండాలి. వీళ్లు అల్లాడుతూనే ఉండాలి. మేం రాజ్యం ఇలాగే చేస్తూనే ఉండాలి అనే కాంక్ష చాలామందికి ఉంది. ఇలాంటి వారందరినీ మేం అదుపు చేస్తూ బలమైన పార్టీగా ఎదిగితేనే రేపు తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్షగా ఉంటుంది. అక్కడ చంద్రబాబూ ఇక్కడ కేసీఆర్ కూడా అదే పని చేశారు. తేడా ఏమిటి? మేం బాబుతో పోల్చుకోదల్చుకోలేదు. మా పోలిక ఎప్పుడూ అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంతో ఉండాలనుకుంటాను. ఏపీతో రాజకీయంగా కాని, అభివృద్ధి విషయంలో కానీ ఏ పరిస్థితుల్లోనూ పోల్చుకూకూడ దని భావిస్తున్నా. మనం ఇద్దరం కూడా ఇంకా బాగున్న వారితో పోటీ పడితే రెండు రాష్ట్రాలుగా ఇద్దరమూ ఎదుగుతామని నా ఆలోచన. బాబు పాలన ఇప్పుడెలా ఉంది? నాన్న ఒక సభలో ఇలా చెప్పారు. మాటలు చెప్పే సమయం కాదు పని చేయవలసిన సమయం ఇదని. మేం అలాగే పని చేసుకుపోతు న్నాము. ప్రజలు ఫలితాలు చూస్తారు. ఆ దృష్టితోనే బాబుమీద వ్యాఖ్యానించన వసరం లేదు కానీ ఏపీ ఒక రాష్టంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోదండరామ్, కేసీఆర్ ఇప్పుడెందుకు దూరంగా ఉంటున్నారు? ప్రాథమికంగా కోదండరామ్ టీఆర్ఎస్ పార్టీ మనిషి కాదు. కేసీఆరే స్వయంగా ఆయనను తీసుకొచ్చి జేఏసీకి చైర్మన్‌గా చేశారు. ఉద్యమంలో కలిసి పనిచేశాం. ప్రభుత్వం వచ్చాక కలిసి పనిచేయాలా వద్దా అనేది ఆయా వ్యక్తులు, సంస్థల నిర్ణయాల పైనే ఆధారపడి ఉంటుంది. మావైపు నుంచి పార్టీలో కాని, ప్రభుత్వంలో కాని కోదండ రామ్‌పై ఎవరికీ వ్యతిరేకత లేదు. తెలంగాణను చాలాకాలంగా నిర్లక్ష్యం చేసారు. రైతుల భూములకు నీళ్లు లేవు. వసతులు లేవు. కరెంటు, మోటార్లు, బోర్లు ఏవీ లేవు. దీర్ఘ కాలంగా జమ అవుతున్న కష్టాలు అని కూడా తెలుసు. తెలిసి కూడా ఈ రెండేళ్లలో ఏమీ చేయలేదని ఏమాత్రం అవగాహన కూడా లేని వారిలాగా కేవలం రాజకీయ విమర్శ చేస్తున్నట్లనిపించడంతో ఉద్యమకా రులంతా బాధపడ్డారు. ఇదేంటి తెలంగాణ నేపథ్యం తెలియని వాళ్లలాగా మాట్లాడు తున్నారు అనే తప్ప మరొకటి ఏం లేదు. కేసీఆర్ కోదండరామ్‌కు ఎందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు? అపాయింట్మెంట్ ఇవ్వడం ఇవ్వకపోవడం కాదు సమస్య. ప్రభుత్వం సమస్య లను పరిష్కరిస్తుందా లేదా అనేది తొలి ప్రశ్న. కోదండరామ్ సర్ చెప్పిన వంద విష యాల్లో మేం ఎన్ని చేయగలమో అవన్నీ చేస్తున్నాం. అందులో అనుమానమే లేదు. కానీ వారు కూడా ఒక రాజకీయనేతగా విమర్శ చేస్తే వారి స్థాయిని తగ్గించుకోవడమే అవు తుంది తప్ప మరొకటి కాదు. కోదండరామ్‌తో మాకు వైరం ఏముంటుంది. ఆయన మాకు సహజ మిత్రులు. కాదని వారనుకుంటే మేమేం చేయలేం. చివరగా.. తెలంగాణ ప్రజలకు మీరిచ్చే సందేశం? తెలంగాణ ప్రజలకు సాక్షి టీవీ ద్వారా నేను చేసే అభ్యర్థన ఏమిటంటే, కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ అహర్నిశలు తెలంగాణ కోసం పనిచేస్తున్న వ్యక్తి, సంస్థ. మనమనుకుంటున్న పనులన్నీ సజావుగా సాగుతున్నాయి. కొంత ఆలస్యం అవు తున్నా, అది మన అలసత్వం కాదు. సాంకేతికంగా సమస్యలు ఉండవచ్చు. కాని తెలం గాణ ప్రజలకోసం పనిచేసే పార్టీగా ఇంతవరకు మీరెలా ఆదరించారో ఇకముందు కూడా మీరు కేసీఆర్‌తో, టీఆర్ఎస్తో నిలబడాలని కోరుకుంటున్నాను. (కవితతో ఇంటర్య్వూ పూర్తి పాఠాన్ని కింది లింకులో చూడండి) https://www.youtube.com/watch?v=oD1t-sowVuU -
నిజాం షుగర్స్ ప్రైవేటుపరం చేసింది బాబే
* నిజామాబాద్ ఎంపీ కవిత మండిపాటు * టీడీపీ ప్రైవేటుపరం చే సినా కాంగ్రెస్ పట్టించుకోలేదు * ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోంది * రైతులకు ఇప్పటిదాకా రూ. 66 కోట్ల సాయం చేసింది * దీనిపై జేఏసీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది సాక్షి, హైదరాబాద్: నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ 1937లోనే 98 శాతం నిజాం ప్రభుత్వ వాటా, 2 శాతం ప్రైవేటు వాటాతో మొదలై ఎంతో వైభవాన్ని చవిచూసిందని నిజామాబాద్ ఎంపీ కవిత తెలిపారు. గురువారం తెలంగాణ భవన్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు పెద్దలు ఇచ్చిన వారసత్వ సంపదైన ఈ సంస్థను 2002లో అప్పటి సీఎం చంద్రబాబు జాయింట్ వెంచర్ పేరిట డెల్టా పేపర్ మిల్స్‌కు 51 శాతం వాటా కట్టబెట్టి ప్రైవేటుపరం చేశారని విమర్శించారు. లాభాల్లో నడుస్తున్న ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయడంపై అప్పట్లో పట్టించుకున్న వారు లేరన్నారు. నిజాం షుగర్స్ ప్రైవేటుపరం అయినప్పట్నుంచి యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా నష్టాలు చూపుతూ వచ్చిందని, 2004 నుంచి పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం ఈ విషయంలో ఏమీ పట్టించుకోలేదన్నారు. 2006లో నాటి ప్రభుత్వం హౌస్ కమిటీ వేసినా 2012 వరకు నిర్ణయాన్ని ప్రకటించలేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 2014 నుంచి ఇప్పటివరకు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు, రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 66 కోట్ల సాయం చేసిందని కవిత చెప్పారు. వరుస నష్టాలు చూపించి యాజమాన్యం లాకౌట్ ప్రకటించిందని, ఇప్పుడు ఈ వ్యవహారం బీఐఎఫ్ఆర్ (బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రికన్స్ట్రక్షన్) పరిధిలో ఉందని, ఆ సంస్థ నిర్ణయం తీసుకునే వరకు ఏమీ చేయలేమన్నారు. సహకార పద్ధతిలో నడుపుకుంటే మంచిది నిజాం షుగర్స్‌కు గత వైభవం రావాలంటే రైతులు సహకార పద్ధతిలో ఫ్యాక్టరీని నడిపేందుకు ముందుకొస్తే అప్పగించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిద్ధంగా ఉన్నారని కవిత తెలిపారు. ఈ విషయంలో అన్ని ప్రాంతాల ప్రజాప్రతినిధులంతా అండగా ఉంటామన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే పెద్దలమని చెప్పుకునే జేఏసీ మాత్రం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్‌లో అఖిలపక్ష సమావేశం అని చెప్పి విపక్షాలను పిలిచి తమను పిలవలేదని, తమను పిలిచి ఉంటే వాస్తవం ఏమిటో చెప్పేవారమన్నారు. లే ఆఫ్ ప్రకటించి నందు వల్ల 400 మంది ఉద్యోగులకు 50 శాతం వేతనాలు ఇవ్వాలని యాజమాన్యానికి కార్మికశాఖ ఇప్పటికే నోటీసులు ఇచ్చిందని, వీఆర్ఎస్ ఇప్పించేందుకూ ఒత్తిడి తెస్తామని చెప్పారు. తప్పు చేస్తే ఎంత పెద్దవారైనా తప్పించుకోలేరు ఓటుకు కోట్లు కేసుపై కవిత ‘‘తప్పు చేసిన వారు ఎంత పెద్దవారైనా తప్పించుకోలేరు. మన చట్టాలు ఇప్పటికే ఈ విషయాన్ని నిరూపించాయి. ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక డెరైక్షన్ అవసరం లేదు. ఇప్పటికే కేసు విచారణ జరుగుతోంది’’ అని కవిత పేర్కొన్నారు. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయంపై ఆరోపణల నేపథ్యంలో కేసును తిరిగి విచారించాలంటూ ఏసీబీ కోర్టు ఏసీబీని ఆదేశించడంపై కవిత ఈ మేరకు స్పందించారు. ఈ కేసుతో ప్రమేయమున్న వారిని ఏసీబీ విచారిస్తుందన్నారు. ఏసీబీ కోర్టు నోటీసు పూర్తిగా సాంకేతికపరమైనదని, దీనిపై ఏసీబీ అధికారులు కోర్టుకూ ఇదే చెప్పారన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకన్నా ఎక్కువ స్పందించలేన ని, కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏసీబీ శాఖాపరంగా కోర్టుకు వివరాలు అందిస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కె.విద్యాసాగర్‌రావు, షకీల్, జీవన్‌రెడ్డి, ఆలె వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పసుపు రైతులను ఆదుకోండి: ఎంపీ కవిత
న్యూఢిల్లీ: నిజామాబాద్ ఎంపీ కవిత బుధవారం ఉదయం కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పసుపు రైతుల సమస్యలపై ఆమె ఈ సందర్భంగా కేంద్రమంత్రితో చర్చించారు. పసుపు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతోపాటు కనీస గిట్టుబాటు ధర పెంపు విషయాన్ని కవిత...రాధామోహన్ సింగ్ దృష్టికి తీసుకు వెళ్లారు. అలాగే పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. దేశంలోనే పసుపు ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నా.. పసుపు పంటకు మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర ప్రకటించే పంటల జాబితా కింద పసుపు పంటను కూడా చేర్చాలని, అలాగే ఇతర వాణిజ్య పంటల జాబితాలో పసుపును కూడా చేర్చాలని కోరారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన యాభై మంది పసుపు రైతులు కూడా వ్యవసాయ మంత్రిని కలిసి, తమ సమస్యలను వివరించారు. జిల్లాలో పండే పసుపుకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని జియోగ్రాఫికల్ గుర్తింపును ఇవ్వాలని వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎంపీ కవిత ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఓ వినతి పత్రాన్ని వ్యవసాయ మంత్రికి సమర్పించారు. -
వీర వనితలకు పుట్టినిల్లు ఓరుగల్లు
హన్మకొండ అర్బన్: రాణిరుద్రమ, మేడారం సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తిగా వరంగల్ గడ్డపై పుట్టిన మహిళలు ఉద్యమంలో ముందుండి పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారని, తెలంగాణ ఉద్యమ చరిత్రలో మహిళా ఉద్యోగుల పాత్ర మరువలేనిదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. శనివారం వరంగల్ నిట్ ఆడిటోరియంలో జరిగిన అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) 5వ జాతీయ సదస్సులో కవిత ప్రసంగించారు. రాష్ట్ర రాజధానిలో నిర్వహించాల్సిన సదస్సును వరంగల్‌లో నిర్వహించడానికి కారణం.. ఇక్కడి మహిళల పోరాట పటిమ దేశానికి చాటేందుకేనని అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి సదస్సుకు వచ్చిన ప్రతినిధులు ఇక్కడి మహిళల పోరాటస్పూర్తితో తమ రాష్ట్రాల్లో, కేంద్రంపైనా సమస్యల సాధనకు ఉద్యమించాలన్నారు. రాష్ట్రంలో పాతపెన్షన్ అమలుకు కృషి 2004 నుంచి ప్రభుత్వం తీసుకువచ్చిన సీపీఎస్ పెన్షన్పద్ధతిపై దేశవ్యాప్తంగా ఉద్యోగులు చేస్తున్న పోరాటాలకు సంపూర్ణమద్దతు ఉంటుందని కవిత అన్నారు. తెలంగాణలో సీపీఎస్ కాకుండా పాత పెన్షన్ విధానాన్నే అమలుచేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని, ఉద్యోగుల సమస్యల విషయంలో సీఎం సానుకూల దృక్పథంతో ఉన్నారని తెలిపారు. కేంద్రం నిధులు తగ్గించినా సీఎం రాష్ట్రంలోని అంగన్వాడీలకు వేతనాలు పెంచారని గుర్తు చేశారు. మహిళా ఉద్యోగులకు రెండేళ్ల బాలల సంరక్షణ సెలవు మంజూరు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు వారికి నోటీసులు జారీచేసిందని, త్వరలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్లనే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆదాయ పన్ను పరిమితి పెంపునకూ.. ప్రస్తుతం మహిళా ఉద్యోగులకు ఆదాయ పన్ను పరిమితి రూ. 2.50 లక్షలుగా ఉందని, దీనికి రూ.6 లక్షలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని కవిత చెప్పారు. ఉద్యోగులు చేస్తున్న ఈ డిమాండ్‌పై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టే విధంగా కేంద్రంపై ఒత్తిడి తె స్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో మహిళలు 16శాతం మాత్రమే ఉన్నారని, ఈ సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏఐఎస్జీఈఎఫ్ చైర్మన్ ముత్తు సుందరం అధ్యక్షతన జరిగిన సదస్సులో టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, కార్యదర్శి హమీద్, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రేచల్, 29 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. 10 డిమాండ్లతో వరంగల్ డిక్లరేషన్ వరంగల్ నిట్ ఆడిటోరియంలో అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ ముత్తుసుందరం అధ్యక్షతన జరిగిన ఐదో జాతీయ మహిళా ఉద్యోగుల సదస్సులో ఉద్యోగుల సమస్యలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన 10 డిమాండ్లను వరంగల్ డిక్లరేషన్ పేరుతో ప్రభుత్వాల ముందుంచారు. అవి.. 1) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలి. 2) ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలి. 3) కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ నియామక విధానాన్ని పూర్తిగా రద్దుచేయాలి. 4) ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలి. 6) ఉద్యోగ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పెంచాలి 7)ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల్లో పిల్లల సంరక్షణాలయాలు ఏర్పాటు చేయాలి. 8) పదోన్నతుల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. 9) అధిక పనిభారంతో రాత్రివేళల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల రక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. 10) అంగన్వాడీ వర్కర్లు, ఆశా కార్యక ర్తలను వెంటనే పర్మినెంట్ చేయాలి. -
మ్యాచ్ ఫిక్సర్లకు టికెట్లు ఇప్పించిన ఘనత మీదే!!
టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధి రాజారాం యాదవ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఉన్న షకీల్ అహ్మద్‌కు బోధన టికెట్ ఇప్పించిన ఘనత కవితకే దక్కుతుందని ఆయన ఆరోపించారు. అవినీతిపరులు, భూకబ్జాదారులు, డ్రగ్స్ కేసులలో ఉన్న క్రిమినల్స్‌ను కవిత చేరదీస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొకైన్, డ్రగ్స్ కేసులో అరెస్టయిన పరస రవికుమార్ నిర్వహించిన మిస్ తెలంగాణ లోగోను కవిత ఎలా ఆవిష్కరిస్తారని రాజారాం యాదవ్ ప్రశ్నించారు. కుట్రలో భాగంగానే విమలక్కపై కేసులు బనాయించారని ఆయన మండిపడ్డారు. -
రైతు ఆత్మహత్యలు బాధాకరం
భవిష్యత్తులో అలా జరుగకుండా చూస్తాం ⇒ వాటితో టీఆర్ఎస్ సర్కారుకు సంబంధం లేదు ⇒ గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే కరెంటు కొరత, కోత ⇒ విద్యుత్ ఉత్పాదన పెంచేందుకు త్వరలో కొత్త ప్రాజెక్టులు ⇒ చిన్న నీటి వనరులను అభివృద్ధి చేస్తాం ⇒ సాగు విస్తీర్ణాన్ని 5 లక్షల నుంచి 10 లక్షల ఎకరాలకు పెంచుతాం ⇒ ఈ సారి రైల్వే బడ్జెట్లో మనకు రూ.200 కోట్ల వరకు రావచ్చు ⇒ ‘మీట్ ది ప్రెస్’లో నిజామాబాద్ ఎంపీ కవిత నిజామాబాద్ అర్బన్: రైతుల ఆత్మహత్యలు వాస్తవమే అయినప్పటికీ, బాధాకరమ ని, భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరుగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని ఎంపీ కవిత అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆమె మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆత్మహత్యలు జరుగలేదన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే రాష్ట్రంతో కరెంటు కొరత ఏర్పడిందన్నారు. చంద్రబాబు హైటెక్ పాలనలో అవకాశం ఉన్నా తెలంగాణలో కరెంటు ఉత్పత్తిని పట్టించుకోలేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నల్గొండ, రామగుండం కేంద్రాలలో కరెంటు ఉత్పాదనకు తగిన ఏర్పాట్లు చేసిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసిందన్నారు. ఏపీ సీఎం నేటికీ రుణమాఫీ చేయలేదన్నారు. వేరే పార్టీలకు మనుగడ లేదు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ మినహా ఏ ఇతర పార్టీలకూ మనుగడ లేదని ఎంపీ కవిత పునరుద్ఘాటించారు. టీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకూ ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోందన్నారు. తన నియోజకవర్గ పరిధిలో పంటల సాగు విస్తీర్ణం ప్రస్తుతం ఐదు లక్షల ఎకరాలుందని, వచ్చే ఐదేళ్లలో పది లక్షల ఎకరాలకు పెంచుతామన్నారు. ఇందుకోసం చిన్న నీటి పారుదల సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ రైల్వే బడ్జెట్లో పెద్దపల్లి,నిజామాబాద్ మార్గానికి రూ.200 కోట్లు మంజూరయ్యే అవకాశముందన్నారు. రైల్వే మంత్రి సురేష్‌ప్రభు తనతో మాట్లాడినప్పుడు ఈ మేరకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. బాన్సువాడ, బోధన్ బీదర్ రైలు మార్గానికి ముందడుగు ఉంటుందన్నారు. గల్ఫ్ బాధితులకు ప్రత్యేక శాఖ గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఎంపీ పేర్కొన్నారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఉన్నతాధికారు లతో ఓ కమిటీ ఏర్పాటు చేశారని, వీటి పరిశీలన కొనసాగుతోందని చెప్పారు. ఇదివరకే జిల్లాలో స్పైసెస్ పార్కుకు అనుమతి ఇచ్చారని, ప్రభుత్వం కూడా దీనికి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆస్పత్రి అభివృద్ధికి చర్యలు తీసుకుం టున్నామన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రినీ అభివృద్ధి చేస్తా మన్నారు. బీడీ కట్టలపై పుర్రె గుర్తును తొలగించడానికి పో రాటం చేస్తామన్నారు. ఛాతీ ఆస్పత్రి తరలింపు ప్రజావసరాల కోసమేనని,ఈ విషయంలో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్న సమ్మతమేనన్నారు. ప్రతిపక్షాలు అనవసర రా ద్ధాంతం చేస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నిక ల ముందు ఇచ్చిన హామీలను రెండేళ్లలోనే అమలు చేసి తీరుతుందన్నారు. ఏడాదిలోపు నేరాల రేటు సగానికి తగ్గిస్తామన్నారు. మహిళలపై అఘాయిత్యాలు, చైన్ స్నా చిం గ్,అత్యాచారాలు వంటి ఘటనలను తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్యకార్డులు, ఇళ్లస్థలాలు జర్నలిస్టులంటే తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే ప్రక్రియ కొనసాగుతోం దన్నారు. అనువైన స్థలం ఎక్కడ ఉందో చూసుకో వాలని సూచించారు. ఆరోగ్య కార్డులు కూడా అందిస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఎంపీ నిధుల నుంచి రూ. 10 లక్షలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎ మ్మెల్యే జీవన్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ సుమనారెడ్డి, మేయర్ ఆ కుల సుజాత,ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పూరి డాన్స్ ఫెస్టివల్ తరహాలో...
నిజామాబాద్ ఎంపీ కవిత నాంపల్లి: పూరి డాన్స్ ఫెస్టివల్ తరహాలో హైదరాబాద్‌లో నృత్యోత్సవాలను వచ్చే ఏడాది నిర్వహిస్తామని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. ఆదివారం రాత్రి రవీంద్ర భారతి వేదికపై లాస్యకల్ప సంస్థ ఆధ్వర్యంలో భారతీయ సంప్రదాయ నృత్యాలైన శ్రీయ, క్షీర సాగర మథనం నృత్య రూపకాలు ప్రదర్శించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ రాబోయే సంవత్సరంలో అద్భుతమైన కళారూపాలను తీసుకువస్తామని ప్రకటించారు. అన్ని జిల్లాల నుంచి కళాకారులను తీసుకురావాలనే లక్ష్యంతో లాస్యకల్ప ఫౌండేషన్, తెలంగాణ జాగృతి, డెల్ఫిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థలతో కలిసి రవీంద్రభారతిలో ‘నుపుర రావమ్-2014’ కార్యక్రమానికి రూపకల్పన చేసి ప్రదర్శనలు ఇచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన శ్రీయ, క్షీర సాగర మథనం నృత్యరూపాలను అత్యద్భుతంగా ప్రదర్శించారు. -
గుండెల్లో పెట్టి చూసుకుంటాం: కవిత
నిజామాబాద్ : టీఆర్ఎస్ పార్టీకి అఖండి విజయాన్ని సాధించి పెట్టిన జిల్లా ప్రజలను, కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎలాంటి పైరవీలకు తావులేకుండా, పారదర్శక పాలన అందిస్తామన్నారు. బాల్కొండ టీఆర్ఎస్ శాఖ ఆధ్వర్వంలో నిర్వహించిన ఎంపీ, ఎమ్మెల్యేల అభినందన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బంగారు తెలంగాణను చూడాలన్న ఆకాంక్షతో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన తెలంగాణ ప్రజల రుణం ఏమిచ్చినా తీరదన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ 14 ఏళ్ల అలుపెరగని పోరాటంతోనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైందన్నారు. ప్రజల విశ్వసించి అధికారాన్ని కట్టబెట్టారని కవిత పేర్కొన్నారు.ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ప్రతి అంశాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.