వీర వనితలకు పుట్టినిల్లు ఓరుగల్లు | AISGEF 5th National Conference at kavitha | Sakshi
Sakshi News home page

వీర వనితలకు పుట్టినిల్లు ఓరుగల్లు

Published Sun, Jan 24 2016 5:42 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

వీర వనితలకు పుట్టినిల్లు ఓరుగల్లు

వీర వనితలకు పుట్టినిల్లు ఓరుగల్లు

హన్మకొండ అర్బన్: రాణిరుద్రమ, మేడారం సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తిగా వరంగల్ గడ్డపై పుట్టిన మహిళలు ఉద్యమంలో ముందుండి పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారని, తెలంగాణ ఉద్యమ చరిత్రలో మహిళా ఉద్యోగుల పాత్ర మరువలేనిదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. శనివారం వరంగల్ నిట్ ఆడిటోరియంలో జరిగిన అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జీఈఎఫ్) 5వ జాతీయ సదస్సులో కవిత ప్రసంగించారు. రాష్ట్ర రాజధానిలో నిర్వహించాల్సిన సదస్సును వరంగల్‌లో నిర్వహించడానికి కారణం.. ఇక్కడి మహిళల పోరాట పటిమ దేశానికి చాటేందుకేనని అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి సదస్సుకు వచ్చిన ప్రతినిధులు ఇక్కడి మహిళల పోరాటస్పూర్తితో తమ రాష్ట్రాల్లో, కేంద్రంపైనా సమస్యల సాధనకు ఉద్యమించాలన్నారు.
 
రాష్ట్రంలో పాతపెన్షన్ అమలుకు కృషి

2004 నుంచి ప్రభుత్వం తీసుకువచ్చిన సీపీఎస్ పెన్షన్‌పద్ధతిపై దేశవ్యాప్తంగా ఉద్యోగులు చేస్తున్న పోరాటాలకు సంపూర్ణమద్దతు ఉంటుందని కవిత అన్నారు. తెలంగాణలో సీపీఎస్ కాకుండా పాత పెన్షన్ విధానాన్నే అమలుచేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని, ఉద్యోగుల సమస్యల విషయంలో సీఎం సానుకూల దృక్పథంతో ఉన్నారని తెలిపారు. కేంద్రం నిధులు తగ్గించినా సీఎం రాష్ట్రంలోని అంగన్‌వాడీలకు వేతనాలు పెంచారని గుర్తు చేశారు.

మహిళా ఉద్యోగులకు రెండేళ్ల బాలల సంరక్షణ సెలవు మంజూరు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు  వారికి నోటీసులు జారీచేసిందని, త్వరలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్లనే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
 
ఆదాయ పన్ను పరిమితి పెంపునకూ..
ప్రస్తుతం మహిళా ఉద్యోగులకు ఆదాయ పన్ను పరిమితి రూ. 2.50 లక్షలుగా ఉందని, దీనికి రూ.6  లక్షలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని కవిత చెప్పారు. ఉద్యోగులు చేస్తున్న ఈ డిమాండ్‌పై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టే విధంగా కేంద్రంపై ఒత్తిడి తె స్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో మహిళలు 16శాతం మాత్రమే ఉన్నారని, ఈ సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏఐఎస్‌జీఈఎఫ్ చైర్మన్ ముత్తు సుందరం అధ్యక్షతన జరిగిన సదస్సులో టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, కార్యదర్శి హమీద్, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రేచల్, 29 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.  
 
10 డిమాండ్లతో వరంగల్ డిక్లరేషన్
వరంగల్ నిట్ ఆడిటోరియంలో అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ ముత్తుసుందరం అధ్యక్షతన జరిగిన ఐదో జాతీయ మహిళా ఉద్యోగుల సదస్సులో ఉద్యోగుల సమస్యలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన 10 డిమాండ్లను వరంగల్ డిక్లరేషన్ పేరుతో ప్రభుత్వాల ముందుంచారు. అవి..
 
1) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలి.
2) ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలి.
3) కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ నియామక విధానాన్ని పూర్తిగా రద్దుచేయాలి.
4) ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలి.
6) ఉద్యోగ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పెంచాలి
7)ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల్లో పిల్లల సంరక్షణాలయాలు ఏర్పాటు చేయాలి.
8) పదోన్నతుల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి.
9) అధిక పనిభారంతో రాత్రివేళల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల రక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి.
10) అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా కార్యక ర్తలను వెంటనే పర్మినెంట్ చేయాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement