నిజాం షుగర్స్ ప్రైవేటుపరం చేసింది బాబే | Nizamabad MP Kavitha Fires on Babu | Sakshi
Sakshi News home page

నిజాం షుగర్స్ ప్రైవేటుపరం చేసింది బాబే

Published Fri, Sep 2 2016 3:00 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

నిజాం షుగర్స్ ప్రైవేటుపరం చేసింది బాబే - Sakshi

నిజాం షుగర్స్ ప్రైవేటుపరం చేసింది బాబే

* నిజామాబాద్ ఎంపీ కవిత మండిపాటు
* టీడీపీ ప్రైవేటుపరం చే సినా కాంగ్రెస్ పట్టించుకోలేదు
* ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోంది
* రైతులకు ఇప్పటిదాకా రూ. 66 కోట్ల సాయం చేసింది
* దీనిపై జేఏసీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది

సాక్షి, హైదరాబాద్: నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ 1937లోనే 98 శాతం నిజాం ప్రభుత్వ వాటా, 2 శాతం ప్రైవేటు వాటాతో మొదలై ఎంతో వైభవాన్ని చవిచూసిందని నిజామాబాద్ ఎంపీ కవిత తెలిపారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు పెద్దలు ఇచ్చిన వారసత్వ సంపదైన ఈ సంస్థను 2002లో అప్పటి సీఎం చంద్రబాబు జాయింట్ వెంచర్ పేరిట డెల్టా పేపర్ మిల్స్‌కు 51 శాతం వాటా కట్టబెట్టి ప్రైవేటుపరం చేశారని విమర్శించారు.

లాభాల్లో నడుస్తున్న ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయడంపై అప్పట్లో పట్టించుకున్న వారు లేరన్నారు. నిజాం షుగర్స్ ప్రైవేటుపరం అయినప్పట్నుంచి యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా నష్టాలు చూపుతూ వచ్చిందని, 2004 నుంచి పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం ఈ విషయంలో ఏమీ పట్టించుకోలేదన్నారు. 2006లో నాటి ప్రభుత్వం హౌస్ కమిటీ వేసినా 2012 వరకు నిర్ణయాన్ని ప్రకటించలేదన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక 2014 నుంచి ఇప్పటివరకు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు, రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 66 కోట్ల సాయం చేసిందని కవిత చెప్పారు.

వరుస నష్టాలు చూపించి యాజమాన్యం లాకౌట్ ప్రకటించిందని, ఇప్పుడు ఈ వ్యవహారం బీఐఎఫ్‌ఆర్ (బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రికన్‌స్ట్రక్షన్) పరిధిలో ఉందని, ఆ సంస్థ నిర్ణయం తీసుకునే వరకు ఏమీ చేయలేమన్నారు.
 
సహకార పద్ధతిలో నడుపుకుంటే మంచిది
నిజాం షుగర్స్‌కు గత వైభవం రావాలంటే రైతులు సహకార పద్ధతిలో ఫ్యాక్టరీని నడిపేందుకు ముందుకొస్తే అప్పగించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిద్ధంగా ఉన్నారని కవిత తెలిపారు. ఈ విషయంలో అన్ని ప్రాంతాల ప్రజాప్రతినిధులంతా అండగా ఉంటామన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే పెద్దలమని చెప్పుకునే జేఏసీ మాత్రం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

నిజామాబాద్‌లో అఖిలపక్ష సమావేశం అని చెప్పి విపక్షాలను పిలిచి తమను పిలవలేదని, తమను పిలిచి ఉంటే వాస్తవం ఏమిటో చెప్పేవారమన్నారు. లే ఆఫ్ ప్రకటించి నందు వల్ల 400 మంది ఉద్యోగులకు 50 శాతం వేతనాలు ఇవ్వాలని యాజమాన్యానికి కార్మికశాఖ ఇప్పటికే నోటీసులు ఇచ్చిందని, వీఆర్‌ఎస్ ఇప్పించేందుకూ ఒత్తిడి తెస్తామని చెప్పారు.
 
తప్పు చేస్తే ఎంత పెద్దవారైనా తప్పించుకోలేరు
ఓటుకు కోట్లు కేసుపై కవిత
‘‘తప్పు చేసిన వారు ఎంత పెద్దవారైనా తప్పించుకోలేరు. మన చట్టాలు ఇప్పటికే ఈ విషయాన్ని నిరూపించాయి. ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక డెరైక్షన్ అవసరం లేదు. ఇప్పటికే కేసు విచారణ జరుగుతోంది’’ అని కవిత పేర్కొన్నారు. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయంపై ఆరోపణల నేపథ్యంలో కేసును తిరిగి విచారించాలంటూ ఏసీబీ కోర్టు ఏసీబీని ఆదేశించడంపై కవిత ఈ మేరకు స్పందించారు. ఈ కేసుతో ప్రమేయమున్న వారిని ఏసీబీ విచారిస్తుందన్నారు.

ఏసీబీ కోర్టు నోటీసు పూర్తిగా సాంకేతికపరమైనదని, దీనిపై ఏసీబీ అధికారులు కోర్టుకూ ఇదే చెప్పారన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకన్నా ఎక్కువ స్పందించలేన ని, కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏసీబీ శాఖాపరంగా కోర్టుకు వివరాలు అందిస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కె.విద్యాసాగర్‌రావు, షకీల్, జీవన్‌రెడ్డి, ఆలె వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement