
కొడుక్కి ములాయం ఝలక్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయం రంజుగా మారింది. ఆ రాష్ట్ర రాజకీయాల్లో సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ మరోసారి తన మార్క్ చూపించారు. ఎవరెన్ని తగువులాడుకున్నా తానే ఫైనల్ అని మరోసారి స్పష్టం చేశారు. కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు ఝలక్ ఇచ్చారు. సోదరుడు శివ్‌పాల్‌యాదవ్‌ను వెనుకేసుకొచ్చారు. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ములాయం సింగ్ తొలి జాబితాను విడుదల చేశారు. 325 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించారు. ఇందులో 176మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి ఛాన్స్ ఇచ్చారు.
ఈ జాబితాలో పూర్తి ప్రభావం ములాయమే చూపించినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సింగ్ పేరు లేకపోవడం పార్టీ వారికి విస్మయాన్ని కలిగించింది. అదే సమయంలో, ములాయం సోదరుడు శివపాల్ యాదవ్‌కు మాత్రం జశ్వంత్ నగర్ నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇస్తున్నట్లు ములాయం తొలిజాబితాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ములాయం మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు.
ఎన్నికల తర్వాతే ఎమ్మెల్యేలు సీఎంను ఎన్నుకుంటారని అన్నారు. నోట్ల రద్దుపై బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, అఖిలేశ్ యాదవ్, శివపాల్ యాదవ్ కలిసి వేర్వేరు జాబితాలు రూపొందించినట్లు తెలిసింది. ఇందులో అఖిలేశ్ 403మంది అభ్యర్థులతో జాబితాను సిద్ధం చేయగా ములాయం మాత్రం సోదరుడు శివపాల్ జాబితానే ఫైనల్ చేస్తున్నట్లు సమాచారం. తొలి జాబితాలో అఖిలేశ్ పేరు లేకపోవడంపై ప్రశ్నించగా ఆయన ముఖ్యమంత్రి అని, ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయాన్ని ఆయనే నిర్ణయించుకుంటారని, తామెలా చూపించగలమంటూ శివపాల్ యాదవ్ అన్నారు.