తండ్రి వర్సెస్ తనయుడు..!
లక్నో: అధికార సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న అంతర్గత పోరు మరోసారి భగ్గుమంది. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆయన తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బట్టబయలు అయ్యాయి.
పార్టీలో రగులుతున్న అంతర్గత ఆధిపత్య పోరును మరోసారి బట్టబయలు చేస్తూ తాజాగా తండ్రి ములాయంకు అఖిలేశ్ లేఖ రాశారు. రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరిస్తూ వచ్చేనెల మూడు నుంచి "సమాజ్‌వాదీ వికాస్ రథయాత్ర' ప్రారంభిస్తానని అఖిలేశ్ ఈ లేఖలో స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ రథయాత్ర ఈ నెల 3న జరగాల్సి ఉండగా.. అనుకోని కారణాలు, అంతర్గత విభేదాల కారణంగా వాయిదా పడింది.
అయితే, వచ్చేనెల 5న సమాజ్‌వాదీ పార్టీ రజతోత్సవం జరగనుంది. ఈ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా జరపాలని ములాయం వర్గం భావిస్తుండగా.. దానికన్న ముందే అఖిలేశ్ ప్రచార పర్వానికి తెరలేపుతుండటం గమనార్హం. దీంతో ఎస్పీ పాతికేళ్ల ఉత్సవాన్ని బహిష్కరించాలని అఖిలేశ్ భావిస్తున్నారని, అందుకే అంతకన్నా రెండు రోజుల ముందే ప్రచార రథయాత్రకు శ్రీకారం చుడుతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారపర్వాన్ని ప్రారంభించాయని, కాబట్టి అధికార పార్టీ ఎస్పీ కూడా ప్రచారాన్ని ప్రారంభించాల్సిన అవసరముందని, ఇందుకు అనుమతి ఇవ్వాలంటూ తండ్రి ములాయంకు ఈ లేఖలో అఖిలేశ్ విజ్ఞప్తి చేశారు. ఈ లేఖలో బాబాయిలు శివ్‌పాల్ యాదవ్, రాంగోపాల్ యాదవ్‌ల పేర్లను కూడా ప్రస్తావిస్తూ.. వారికి కూడా పంపడం గమనార్హం.
బాబాయి శివ్‌పాల్-అబ్బాయి అఖిలేశ్ మధ్య ఎస్పీలో ఆధిపత్య పోరుకు తెరలేచిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో కొడుకు అఖిలేశ్ కన్నా తమ్ముడు శివ్‌పాల్‌కే ములాయం మద్దతు పలికారు. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న శివ్‌పాల్ యాదవ్‌కు ములాయం పూర్తి అధికారాలు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో గుర్రుగా ఉన్న అఖిలేశ్ వర్గం ప్రచారంలో పైచేయి సాధించాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. కాగా, అఖిలేశ్ లేఖను శివ్‌పాల్ వర్గం తీవ్రంగా తప్పుబడుతున్నది.