
యూపీ సీఎం అఖిలేష్, ములాయం రెండో భార్య సాధన (ఫైల్ ఫొటో)
లక్నో: రోజుకో మలుపు తిరుగుతున్న యాదవ్ పరి'వార్'లో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. 'సవతి కొడుకు ఎదుగుదలను చూడలేని ఆ మారుతల్లి మా ముఖ్యమంత్రికి చేతబడి చేయించింది' అని అఖిలేష్ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఉదయ్ వీర్ సింగ్ విమర్శించారు. ఈ మేరకు పార్టీ చీఫ్ ములాయం కు రాసిన లేఖలో ఉదయ్ వీర్ సంచలన ఆరోపణలు చేశారు.
శివపాల్ యాదవ్ తో కుమ్మక్కైన సాధన.. సీఎం అఖిలేష్ ను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, చేతబడి కూడా చేయించారని ఎమ్మెల్సీ ఉదయ్ వీర్ లేఖలో రాశారు. ములాయం సింగ్ తన పదవి నుంచి వైదొలిగి పార్టీ బాధ్యతలు అఖిలేష్ కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, అంతర్గతంగా రాసిన ఈ లేఖ మీడియాకు ఎలా బహిర్గతమైందో తెలియదని ఉదయ్ వీర్ అంటున్నారు. ఈ లేఖపై అగ్గిమీద గుగ్గిలమైన ములాయం వర్గీయులు.. 'ఇలాంటి లేఖలు కనీసం 500 ఓట్లను కూడా రాలవని, ఇంకోసారి నేతాజీ(ములాయం)ని తప్పుకోవాలనంటే తాట తీస్తామ'ని అఖిలేష్ వర్గాన్ని హెచ్చరించారు.
ఎవరీ సాధన యాదవ్?
సాధనా గుప్తా యాదవ్.. సమాజ్ వాదీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య. 2007లో ములాయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటి నుంచి యాదవ్ పరివారంలో సాధన 'ఫస్ట్ లేడీ'గా కొనసాగుతున్నారు. ములాయం మొదటి భార్య ముల్తీ యాదవ్ 2003లో కన్నుమూశారు. ఆమె చనిపోవడానికి చాలా ఏళ్ల ముందే ములాయం సాధనను రహస్యంగా పెళ్లిచేసుకున్నారు.
మొదట్లో సమాజ్ వాది కార్యకర్తగా పనిచేసిన సాధనను ములాయం పలు సందర్భాల్లో కలుసుకోవడం, ఇద్దరి మధ్యా చనువు పెరగడంతో ఒక శుభ దినాన పెళ్లాడారు. అయితే ఎక్కడ పెళ్లిచేసుకున్నారనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఈ ఇరువురికీ (1988లో)జన్మించిన ప్రతీక్ యాదవ్ ప్రస్తుతం యూపీలో బడా రియల్టర్. రెండో పెళ్లి విషయాన్ని చాలా కాలం దాచే ప్రయత్నం చేసిన ములాయం.. రాజకీయ విమర్శల నేపథ్యంలో 2007లో ఆ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న అంతర్గత సంక్షోభంలో సాధన తన భర్త ములాయం వర్గానికి అనుకూలంగా, మారు కొడుకు అఖిలేఖ్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు ఇటీవలి కాలంలో విమర్శలు ఎక్కువయ్యాయి.