న్యూఢిల్లీ: దేశవ్యాప్త జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)ను రూపొందించే విషయంపై ఇంతవరకు చర్చ జరగలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. దీనిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్య వాస్తవమేనన్నారు. ‘2014లో తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేబినెట్లో కానీ, పార్లమెంట్లో కానీ దేశవ్యాప్త ఎన్నార్సీపై చర్చ జరగలేదు’ అని ఆదివారం ఓ బహిరంగ సభలో మోదీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
మంగళవారం ఏఎన్‌ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా కూడా అదే విషయాన్ని ధ్రువీకరించారు. పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతుండటంపై స్పందిస్తూ.. ‘ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం కొంత ఉందని ఒప్పుకుంటాను. కొంత సమాచార లోపం కనిపిస్తోంది. అయితే, ఏ ఒక్క మైనారిటీ వ్యక్తి కూడా తన పౌరసత్వాన్ని కోల్పోడు అని పార్లమెంట్లోనే నేను చెప్పాను’ అని షా వివరించారు. 2024 లోక్‌సభ ఎన్నికలలోగా దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తామని, ప్రతీ ఒక్క అక్రమ వలసదారుడిని దేశం నుంచి తరిమేస్తామని పార్లమెంట్లోను, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలోనూ అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment