ఆధార్‌కు డబ్బులు మాత్రం చెల్లించకండి:యూఐడీఏ
Published Mon, Sep 11 2017 11:48 AM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM
సాక్షి, న్యూఢిల్లీ: అన్నింటికి ఇప్పుడు ఆధార్ ఆధారంగా మారింది. సిమ్ కార్డుల దగ్గరి నుంచి బ్యాంకు ఖాతాల దాకా అన్నింటికి జత చేయాల్సిన పరిస్థితి. అలాకానీ పక్షంలో ఆయా సేవలను నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు పంపింది. దీంతో ఆధార్ సెంటర్లకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకుంటూ పలువురు అవినీతికి పాల్పడుతున్నారు.
ఆధార్ కార్డుల దరఖాస్తుల పేరిట పెద్ద ఎత్తున్న వసూళ్లకు పాల్పడుతున్న దృశ్యాలు అనేకం దేశ రాజధానిలో వెలుగు చూశాయి. సాధారణంగా ఆధార్ సమాచారం అప్ డేట్ కోసం.. అందులో మార్పులు.. చేర్పుల కోసం అధికారికంగా నిర్ణయించిన ఫీజు 25 రూపాయలు.. కానీ, తన దగ్గరి నుంచి 200 రూపాయలు వసూలు చేస్తారని చెబుతున్నారు లాల్ కౌన్ ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే మహిళ.
జంగ్‌పూరకు చెందిన ఆర్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. స్థానికంగా ఉండేరో సైబర్ కేఫ్ నిర్వాహకుడి దగ్గర ఆధార్ నమోదు కేంద్రం అనుమతులు కూడా ఉన్నాయి. దీంతో ఎడా పెడా డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నాడు. ఆర్తి ఆధార్ లేకపోవటంతో అతన్ని సంప్రదించంగా 500 రూపాయలు వసూలు చేశాడు. ఆర్తి, లక్ష్మీలే కాదు ఆధార్ పూర్తి ఉచితం అన్న విషయం తెలీక చాలా మంది ఇలా ఆధార్ సెంటర్లలో డబ్బులు చెల్లిస్తున్నారు.
కానీ, రాకేష్ మాత్రం అలా కాదు. ఆధార్ సభ్యత నమోదు ఫ్రీ అని అతనికి తెలుసు. అందుకే 150 రూపాయలు నిర్వాహకుడు డిమాండ్ చేస్తే.. వెంటనే టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి ధృవీకరించి వెంటనే తన ఆధార్‌ను ధరఖాస్తు చేసుకున్నాడు. వెంటనే అతను ఇచ్చిన ఫిర్యాదుతో ఆ నిర్వాహకుడి కేంద్రానికి అనుమతి రద్దు చేసేశారు. ఇలా ఆధార్ కోసం డబ్బులు వసూలు చేయటం సన్నివేశాలు ఒక్క ఢిల్లీలోనే కాదు... దేశవ్యాప్తంగా చాలా చోట్ల కనిపిస్తున్నాయి.
ఇలా అవినీతికి పాల్పడిన విషయాలు తమ పరిధిలోకి వస్తే అధికారిక కేంద్రాల లైసెన్సు రద్దు చేయటంతోపాటు వారికి జరిమానా కూడా విధించినట్లు యూఐడీఏఐ చెబుతోంది. 2016 నుంచి ఇప్పటిదాకా 5871 మంది ఆపరేట్లపై ఫిర్యాదు అందటంతో వారిపై చర్యలు తీసుకున్నామని యూఐడీఏఐ చీఫ్ డాక్టర్ అజయ్ భూషణ్ పాండే చెబుతున్నారు. ఒకవేళ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ పేరిట ఎవరైనా ఛార్జీలు వసూలు చేస్తే వెంటనే @uidai.gov.in కి మెయిల్ చేయటంగానీ లేదా 1947 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని పాండే సూచిస్తున్నారు.
Advertisement
Advertisement