'నో కాంప్రమైజ్.. బడ్జెట్ ఫిబ్రవరి 1నే'
పంజాబ్: గతంలో దేశ రక్షణ కోసం భారత సరిహద్దు దాటిన దమ్మే గత ప్రభుత్వానికి లేకుండాపోయిందని(సర్జికల్ దాడిని పరోక్షంగా చెబుతూ), తమలాగా నల్లధనం, అవినీతిపై ఇంత పెద్ద మొత్తంలో దాడి ఏ ప్రభుత్వం చేయలేదని కేంద్రం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు దూషణలతోనే సరిపెడుతుందని అన్నారు. ఫిబ్రవరి 1నే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి తీరుతామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి స్పష్టం చేశారు. తాము ప్రవేశ పెట్టనున్న బడ్జట్‌ను మూడు నెలల కిందటే ఫైనల్ చేశామని ఆయన చెప్పారు. ఆదివారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బీజేపీ నిర్వహిస్తున్న విజయ్ సంకల్ప్ యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఐదు రాష్ట్రాలకు ఎన్నికల తేదీలను ప్రకటించిన నేపథ్యంలో బడ్జెట్‌ను వాయిదా వేయాలని ఇప్పటికే విపక్షాలు డిమాండ్ చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషన్‌ను కూడా కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన జైట్లీ బడ్జెట్ పెట్టితీరుతామన్నారు. బడ్జెట్‌ను వాయిదా వేసే సంప్రదాయం ఎప్పుడూ లేదని అన్నారు. ఇక పంజాబ్ రాజకీయాల గురించి 2002 నుంచి 2007 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌కు ఒక్కపనైనా చేసిందా? అని ప్రశ్నించారు. ఎంతసేపటికి ఆ పార్టీ కక్షపూరిత రాజకీయాలతో, ఇతరులపై నిందలు వేస్తూ ముందుకెళ్లిందని గట్టిగా ఆరోపించారు. నియంత్రణ రేఖ దాటే దమ్ము గతంలో ఏ ప్రభుత్వానికి లేకుండా పోయిందని, నల్లధనం, అవినీతిపై ఇంత పెద్ద మొత్తంలో దాడి చేయలేకపోయిందని అరుణ్ జైట్లీ చెప్పారు.