
రూ.50, 100 నోట్ల రద్దు లేదు
న్యూఢిల్లీ: త్వరలో రూ.100, రూ.50 నోట్లను కూడా రద్దు చేస్తారంటూ వచ్చిన వదంతులను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆ నోట్లను రద్దు చేసే ఉద్దేశం లేదని స్పష్టంచేసింది. రూ.50/100 నోట్లు చెల్లవంటూ ప్రధానమంత్రి జాతినుద్దేశించి మరోసారి ప్రసంగిస్తారంటూ వచ్చిన వార్తలు కట్టుకథలని తేల్చిచెప్పింది. నోట్ల రద్దుతో ప్రయోజనాల కంటే వ్యయమే ఎక్కువగా ఉందన్న వ్యాఖ్యలను కూడా కేంద్రం ట్విటర్‌లో కొట్టిపారేసింది. అలాగే బ్యాంకు లాకర్లను, బంగారు, వజ్రాల ఆభరణాలను సీజ్ చేసే ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదని తెలిపింది. రూ.2వేల నోటు నాణ్యత సరిగాలేదని, నోటు రంగు వెలిసిపోతోందంటూ వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తూ..
దీని గురించి ఆందోళనవసరం లేదని, అదొక భద్రతాపరమైన అంశమని పేర్కొంది. వీటిని ఇంటాగ్లియో ప్రింటింగ్ అనే ఫీచర్‌తో రూపొందించామని, అసలు నోటుపై బట్టతో రుద్ది పరీక్షిస్తే టర్బో ఎలక్ట్రిక్ ప్రభావం వల్ల ఆ ఇంకు రంగు బట్టకు అంటుకుంటుందని తెలిపింది. రూ.2 వేల నోటులో చిప్‌ను దాచి ఉంచారని వచ్చిన వదంతులను తోసిపుచ్చింది. నల్లధనాన్ని నియంత్రించేందుకు విదేశీ ప్రభుత్వాలతో సమాచారాన్ని పంచుకుంటామని, బినామీ లావాదేవీల చట్టంలో సవరణలు తెస్తామని తెలిపింది. నోట్ల రద్దు విషయాన్ని పూర్తి గోప్యంగా ఉంచామని, ఏ ఒక్కరికీ లీక్ చేయలేదని స్పష్టంచేసింది.