
విభజనతో జల సమస్య రాదు: గవర్నర్
తిరువళ్లూరు(తమిళనాడు), న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటికీ రెండు ప్రాంతాల మధ్య నదీ జలాల సమస్య ఉత్పన్నం కాబోదని ఆ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. తిరువళ్లూరు జిల్లాలోని వీరరాఘవస్వామి ఆల యంలో శుక్రవారం జరిగిన పవిత్రోత్సవంలో ఆయన పాల్గొన్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడినా కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు గోదావరి, కృష్ణా జలాల సమస్య ఉత్పన్నం కాబోదన్నారు. తమిళనాడుకు నీటి విడుదలలో కోర్టు ఆదేశాలను సైతం కర్ణాటక ఖాతరు చేయట్లేదని, మరి ఆంధ్రప్రదేశ్‌లో సమస్య రాదా? అని ప్రశ్నించగా.. ఆంధ్రా, తెలంగాణ మధ్య నీటి సమస్యే ఉత్పన్నం కాదంటూ నరసింహన్ అసహనం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ రాజీనామా చేసినట్లు తనకు తెలియదన్నారు. రాజీనామాలు చేస్తున్నట్లు మీడియా, పత్రికల్లో వార్తలు రావడం, నేతల ప్రకటనల్ని విలేకరులు ప్రస్తావించారు. అయితే ఆయా విషయాల్ని మీడియానే అడగండంటూ ఆయన జవాబు దాటే శారు.
రాజీనామాలు ఎవరూ చేయలేదని, రాజీనామా చేసినట్టు తన దృష్టికి రాలేదని పునరుద్ఘాటిం చారు. నగరి, పుత్తూరు, తిరుపతి, తడ ప్రాంతాల్ని తమిళనాడులో విలీనం చేయడం సాధ్యం కాదన్నారు. సమైక్యాంధ్ర, తెలంగాణ, రాయల తెలంగాణలో దేనికి మద్దతిస్తారన్న ప్రశ్నకు ఆయన బదులివ్వలేదు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతపై కేంద్రానికి నివేదిక ఇస్తున్నారా? అని విలేకరులు గవర్నర్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన ‘సీమాంధ్రలో ఉద్యమం జరుగుతోందా?’ అంటూ ప్రశ్నించారు. సీమాంధ్రలో హాస్టల్స్ మూసివేత అంశం తన దృష్టికి వచ్చిందని, వర్సిటీ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.