
నిందితులు శేఖర్, స్వాతి
తిరువళ్లూరు (చెన్నై): ప్రియురాలికి కానుక ఇచ్చేందుకు ఓ ప్రియుడు దొంగగా మారాడు. ఏకంగా భార్య, తల్లి బంగారు నగలు చోరీ చేసి, వాటి నుంచి వచ్చిన సొమ్ముతో ప్రియురాలికి కారును బహుమతిగా ఇచ్చాడు. పోలీసులకు పట్టుబడ్డాడు. తిరువళ్లూరు జిల్లా పూనమల్లి ముత్తునగర్‌కు చెందిన శేఖర్(40) స్వీట్‌స్టాల్, ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మనస్పర్ధల కారణంగా కొద్దిరోజుల క్రితం అతని భార్య మల్లిక పుట్టింటికి వెళ్లింది.
బంధువులు రాజీ కుదిర్చి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చిన మల్లిక బీరువాలో ఉంచిన 300 సవర్ల బంగారు నగలను పరిశీలించగా అవి మాయమయ్యాయి. అలాగే శేఖర్ తల్లికి చెందిన మరో 200 సవర్ల బంగారు నగలు, రెండు బంగారు బిస్కెట్లు కనిపించలేదు. దీనిపై శేఖర్, అతడి సోదరుడిని ఆరాతీయగా తనకు నగలు విషయం అస్సలు తెలియదని చెప్పడంతో బాధితులు పూందమల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంటి దొంగల పనే..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బీరువాను పరిశీలించారు. తాళాలు పగలగొట్టకుండా నగలు ఎలా మాయమయ్యాయనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంటి దొంగలే చేతివాటాన్ని ప్రదర్శించి ఉంటారని నిర్దారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. మొదట శేఖర్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. విచారణలో కుటుంబ సభ్యులకు చెందిన బంగారు నగలను దొంగతనం చేసి ప్రియురాలు స్వాతికి ఇచ్చినట్లు అంగీకరించాడు. కొన్ని నగలు అమ్మి తద్వారా వచ్చిన నగదుతో కారును గిఫ్ట్‌గా ఇచ్చినట్టు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు శేఖర్, ప్రియురాలు వేళచ్చేరికి చెందిన స్వాతిని అరెస్టు చేసి వారి నుంచి కారును సీజ్ చేశారు.
కీలేడీ
మల్లిక పుట్టింటికి వెళ్లిన సమయంలో శేఖర్‌కు స్వాతి పరిచయమైంది. వీరి స్నేహం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి చెన్నైలోని ప్రైవేటు హాటల్‌లో తరచూ కలుసుకునే వారు. ఈ క్రమంలో శేఖర్ వద్ద స్వాతి లక్షల్లో డబ్బు స్వాహా చేసింది. ఈ క్రమంలో బంగారు నగలు, కారును గిఫ్ట్‌గా ఇవ్వాలని స్వాతి కోరడంతో వేరే మార్గం తెలియని శేఖర్ ఇంట్లో నగలను దొంగిలించి కొంత కానుకగా ఇచ్చాడు.
కొన్ని నగలు అమ్మి తద్వారా వచ్చిన నగదుతో కారును గిప్ట్‌గా ఇచ్చినట్టు పోలీసుల విచారణలో నిర్ధారించారు. శేఖర్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్, స్వాతిలను అరెస్టు చేసి వారి నుంచి కారును సీజ్ చేశారు. కాగా స్వాతికి ఇదివరకే పలువురు వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. మరింత సమాచారం కోసం యువతిని విచారణ చేస్తున్నారు. శేఖర్‌ను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment