'ప్రకృతి పిలుపు'కు దూరంగా రైలు డ్రైవర్లు | No toilet break, train drivers seek NHRC help | Sakshi
Sakshi News home page

'ప్రకృతి పిలుపు'కు దూరంగా రైలు డ్రైవర్లు

Published Sun, Jan 17 2016 10:23 AM | Last Updated on Sat, Oct 20 2018 4:38 PM

'ప్రకృతి పిలుపు'కు దూరంగా రైలు డ్రైవర్లు - Sakshi

'ప్రకృతి పిలుపు'కు దూరంగా రైలు డ్రైవర్లు

న్యూఢిల్లీ: మూత్రవిసర్జన.. వార్త అయ్యేంత లేదా మాట్లాడుకునేంత గొప్ప విషయం కాకపోవచ్చు కానీ మనిషి సహా జంతుజాలమంతా తప్పనిసరిగా చేయాల్సిన పని. ప్రపంచఖ్యాతి పొందిన ఓ సంస్థలో మాత్రం ఉద్యోగులు ఒంటికీ, రెంటికీ పోయడానికి లేదా పోవడానికి వీల్లేదు. అర్జెంటుగా రారమ్మంటున్నా.. డ్యూటీలో ఉండే ఆ 12 గంటలూ  ప్రకృతి పిలుపునకు స్పందించొద్దంటూ కఠిన నిబంధనలున్నాయి. అలా మూత్రాన్ని బిగబట్టడం అలవాటై, అది 'రాయబడని' మానవహక్కుల  ఉల్లంఘన అని తెలుసుకున్న ఉద్యోగులు చివరకు జాతీయ మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. 'అయ్యా మా బాధను కాస్త పట్టించుకోండి' అని.

ఒక లక్షా పదిహేనువేల కిలోమీటర్ల ట్రాక్ పై రోజుకు రెండున్నర కోట్ల మంది ప్రయాణికుల చేరవేత, లక్షల టన్నుల సరుకు రవాణా, విరామం లేకుండా తిరిగే 19 వేల రైళ్లు, 13 లక్షలకుపైగా ఉద్యోగులు 7,112 స్టేషన్లు.. చెప్పుకుంటూపోతే ఇండియన్ రైల్వేస్ ఘనత కొండవీటి చాంతాడు. అయితే ఆ సంస్థకు చోదకులుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తోన్న 69వేల మంది రైలు డ్రైవర్లు(లోకో పైలట్స్) దారుణమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. నిర్దేశిత 12 గంటల పనివేళలో నిమిషం సేపైనా విరామం లేకపోగా, మనిషికి అత్యవసరమైన మలమూత్రాల విసర్జనకుసైతం అనుమతిలేదు.

 

163 ఏళ్లుగా కొనసాగుతూవస్తోన్న ఈ వ్యవహారం ఎందరో రైలు డ్రైవర్లును అనారోగ్యానికి గురిచేయడమేకాక ప్రమాదాలకూ కారణమవుతున్నదని వాదిస్తున్నారు ఇండియన్ రైల్వే లోకో రన్నింగ్ మెన్స్ ఆర్గనైజేషన్(ఐఆర్ఎల్ఆర్ఓ)గా ఒక్కటైన రైలు డ్రైవర్లు. ఇప్పుడిప్పుడే పెరుగుతోన్న మహిళా లోకోపైలట్ల బాధలైతే ఇంకా ఘోరం. ఈ మేరకు తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా ఎన్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఏమిటీ సంగతి? అని ఎన్ హెచ్ఆర్సీ ప్రశ్నించగా దానికి రైల్వే అధికారులిచ్చిన సమాధానం ఇలా ఉంది.. 'మూత్రవిసర్జన లేదా పనివేళలో కాసేపు విరామం ఇస్తే ఆ ప్రభావం రైళ్ల రాకపోకలపై పడుతుంది. మొత్తం రైల్వే వ్యవస్థకు నష్టం చేకూరుతుంది'

రోడ్డు మార్గంలో వాహనాలు నడిపే డ్రైవర్ ప్రతి నాలుగైదు గంటలకు ఒకసారి తప్పనిసరిగా విరామం తీసుకోవాలని రవాణాశాఖలో ఆదేశాలున్నాయి. ఢిల్లీ మెట్రో రైల్ డ్రైవర్లకు ప్రతి మూడు గంటలకు ఒకసారి 40 నిమిషాల బ్రేక్ దొరుకుతుంది. ఇక విమానాల్లోనైతే కావాల్సినన్నిసార్లు టాయిలెట్ కు వెళ్లే అవకాశం ఉంటుంది పైలట్లకు. మరి లోకోపైలట్లకు మాత్రం ఎందుకీ శిక్ష!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement