కమల్‌కు కోపం 'రిసార్ట్స్ ఎమ్మెల్యేల సంగతేంది?'
సాక్షి, చెన్నై : త్వరలో రాజకీయ పార్టీని పెడతారని భావిస్తున్న ప్రముఖ దక్షిణాది నటుడు కమల్ హాసన్‌కు తీవ్ర ఆగ్రహం వచ్చింది. మరోసారి ఆయన అన్నాడీఎంకే పార్టీపై నిప్పులు చెరిగారు. ఉద్యోగులపైనే మీ ప్రతాపం చూపిస్తారా? శాసన సభలకు, విధులకు హాజరుకాని ఎమ్మెల్యేలను ఏమీ అనరా అంటూ నిలదీశారు. తమ జీతభత్యాలు పెంచాలంటూ కొద్ది రోజులుగా తమిళనాడులోని 33వేలమంది ఉపాధ్యాయులు రోడ్లెక్కి నిరసనలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని పాఠశాలలకు హాజరుకావాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
ఇదే అదనుగా చేసుకొని విధుల్లోకి చేరని వారికి జీతభత్యాలు చెల్లించేది లేదని 'నో వర్క్ నో పే' అంటూ తమిళనాడు పళనీస్వామి ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై స్పందించిన కమల్ హాసన్ 'నో వర్క్ నో పే అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమేనా? డబ్బుకు అమ్ముడుపోయి విధులకు హాజరుకాకుండా రిసార్టుల్లో ఉంటున్న నాయకుల సంగతేమిటి? గౌరవనీయ న్యాయస్థానం నిరసనల్లో ఉన్న ఉపాధ్యాయులను హెచ్చరించింది. ఈ సందర్భంగా న్యాయస్థానానికి ఒక విషయం విన్నవించుకుంటున్నాను.
అలాంటి హెచ్చరికనే పనులకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న చట్టప్రతినిధులకు ఇవ్వాలి' అంటూ ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు. ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీలోనే ఉంటూ దినకరన్‌వైపు ఉన్న 19మంది అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు వివిధ రిసార్టుల్లో ఉన్న విషయం తెలిసిందే. వీరి ఆధారంగానే పళనీ స్వామి ప్రభుత్వాన్ని పడగొట్టాలని దినకరన్ భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా అన్నాడీఎంకేని లక్ష్యంగా కమల్ హాసన్ ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే.