విలీనంపై స్పందించిన కమల్
చెన్నై: తమిళ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై నటుడు కమల్ హాసన్ మరోసారి ఘాటుగా స్పందించారు. అన్నా డీఎంకే విలీనంపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. తమిళనాడు తలపై మూర్ఖుల టోపీ(ఫూల్స్ టోపీ) కూర్చుందని.. తమిళనాట ఇంతకంటే ఏం కావాలంటూ మండిపడ్డారు. అంతేకాదు ఇది చాలదా.. ఇంకా కావాలా.. దయచేసి స్పందించండంటూ తమిళులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
పళని స్వామి, పన్నీరు సెల్వం వర్గాల విలీంపై సోమవారం కమల్ ట్విట్టర్‌లో స్పందించారు. "గాంధీ టోపీ! కాషాయ టోపీ! కాశ్మీర్ టోపీ! ఇప్పుడు ఫూల్స్ టోపీ! ఇది చాలదా? మరింత కావాలా? తమిళులారా దయచేసి నిలబడండి అని సోమవారం మధ్యాహ్నం తమిళంలో ట్వీట్ చేశారు.
కాగా కమల్‌హాసన్‌కు, అధికారంలో ఉన్న అన్నాడీఎంకే వర్గం మధ్య గత కొన్ని రోజులుగా విమర్శలు ప్రతివిమర్శలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అవినీతిలో కూరుకుపోయారని ఇటీవల కమల్ విమర్శిస్తే, దీనిపై రాష్ట్ర మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ పరిపాలన శాఖామంత్రి ఎస్‌పీ వేలుమణి కమల్ ఆదాయం, పన్నులు చెల్లింపు తదితర అంశాలపై తనిఖీ చేయడానికి ఆడిట్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అలాగే వివిధ ప్రభుత్వశాఖల్లో ఉన్న అవినీతిపై సాక్ష్యాలుంటే బయటపెట్టాలని మంత్రి సవాల్ చేశారు. మరోవైపు కమల్ రాజకీయాల్లోకి రావడం ఖాయమనే అంచనాలు కూడా భారీగానే నెలకొన్న సంగతి విదితమే.
காந்திக்குல்லா!காவிக்குல்லா!கஷ்மீர்குல்லா!! தற்போது கோமாளிக்குல்லா, தமிழன் தலையில் . போதுமா இன்னும் வேண்டுமா? தயவாய் வெகுள்வாய் தமிழா.
— Kamal Haasan (@ikamalhaasan) August 21, 2017