యూజీసీపై రివ్యూ ప్యానెల్
న్యూఢిల్లీ: నాన్ నెట్ అభ్యర్థులకు ఫెలోషిఫ్లు ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం చేసిన ఆలోచనపట్ల దేశ వ్యాప్తంగా నిరసన పెల్లుబుకుతున్న నేపథ్యంలో దానిపై పూర్తిస్థాయిలో పరిశీలనలు జరిపి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం ఐదుగురితో ఓ ప్రత్యేక ప్యానెల్ను ఏర్పాటు చేసింది. అసలు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఇస్తున్న పరిశోధన గ్రాంటులను పూర్తి స్థాయిలో పరిశీలించాల్సిందిగా ఆ ప్యానెల్కు ఆదేశించింది.
నాన్ నెట్ అభ్యర్థులకు ఫెలో షిప్లు చెల్లించొద్దని యూజీసీకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా పరిశోధక విద్యార్థిలోకంతోపాటు పీజీ విద్యార్థులకు కూడా కేంద్రం నిర్ణయంపై భగ్గుమన్నారు. గత ఎనిమిది రోజులుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మెట్టు దిగొచ్చిన కేంద్రం తమ నిర్ణయాన్ని ఇప్పుడే అమలు చేయొద్దని యూజీసీకి సూచించింది. అయితే, ఇది కంటి తుడుపుచర్యేనని, కేంద్రం తన ప్రకటనను పూర్తి స్థాయిలో వెనక్కి తీసుకున్నప్పుడే తాము ఆందోళన విరమిస్తామంటూ ఉద్యమం కొనసాగిస్తున్నారు.