న్యూఢిల్లీ: మత అసహనంపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పెదవి విప్పారు. ఇటీవలి పరిణామాలు జాతిని తీవ్రంగా బాధించాలయని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. వాక్ స్వేచ్ఛ, విశ్వాసాలు, నమ్మకాలపై జరిగిన దాడులు బాధాకరమని మన్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. మేధావుల హత్యలను ఎవరూ సమర్థించుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. భిన్నాభిప్రాయాల అణచివేత చాలా ప్రమాదకరమని మన్మోహన్ అన్నారు.
జవహర్ లాల్ 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ మతం అనేది వ్యక్తిగతమని, దీనిలో ఎవరూ జోక్యం చేసుకోకూడదన్నారు. కాగా నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో అహసనం పెరిగిపోయిందంటూ పలువురు రచయితలు, నటీనటులు సాహిత్య అకాడమీ పురస్కారాలను వాపస్ ఇస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రాజకీయంగా దెబ్బతిన్న వాళ్లంతా.. ఏం చేయాలో అర్థంకాక అసహనం పేరుతో నాటకాలు చేస్తున్నారని బీజేపీ మండిపడుతోంది.