సోనియా అల్లుడు వస్తున్నాడా?
న్యూఢిల్లీ: ఇప్పుడు జాతీయ మీడియాలో పరోక్షంగా ఓ చర్చ జరుగుతోంది. అది రాబర్ట్‌వాద్రా గురించి. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త అయిన ఆయన తెర వెనుక ఉండి రాజకీయ ప్రవేశం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా అని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. ఇటీవల కాలంలో ఆయన అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే ఏదో ఒక రోజు అనూహ్యంగా తెరమీదకు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. సోషల్ మీడియాలో ఆయన క్రియాశీలం అవుతున్న తీరు చూస్తుంటే కూడా ఇప్పుడిప్పుడే సామాన్యుల జీవన విధానాలను, స్థితిగతులను పట్టించుకుంటున్నారని తెలుస్తోంది.
ఎప్పుడు బిజినెస్ కార్యక్రమాల్లో తలమునకలై ఉండే రాబర్ట్ వాద్రా.. ఈ మధ్య ఎయిమ్స్ ఆస్పత్రి బయట ఎక్కువగా కనిపిస్తున్నారు. అక్కడి రోగులకు, పేదవారికి అన్నదానం చేస్తూ దర్శనం ఇస్తున్నారు. ప్రతి క్షణం ఏదో ఒక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫొటోల, వీడియోల రూపంలో పోజులిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. అంతేకాదు, ఢిల్లీలోని ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో దాన ధర్మాలు చేయడంతోపాటు అంధుల మధ్య కేకులు కట్ చేస్తూ కనిపిస్తున్నారు.
పైగా ఇలాంటి పనుల్లో పాల్గొన్న ఆయన ‘ఇతరుల సంతోషం కోసం నువ్వు ఏది చేయని నాడు నీకంటూ ప్రత్యేకమైన రోజు ప్రత్యేకంగా ఉండదు’ అంటూ తాత్విక హితబోధలు తన ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల్లో పెడుతున్నారు. అలాగే, ఇటీవల జాదవ్‌కు పాక్ ఉరిశిక్ష విధించడంపై స్పందిస్తూ గతంలో జాదవ్ కంటే ముందు ఐదుగురు భారతీయులను ఇలాంటి ఆరోపణలతోనే అరెస్టు చేసిన పాక్ చివరకు వారి జైళ్లలోనే చనిపోయేలా చేసిందని ఓ పత్రిక కథనం వెలువరించినట్లు గుర్తు చేశారు.
కేంద్రం ఈ ఒక్కసారి దేశం తరుపున తన శక్తివంచన లేకుండా ప్రయత్నించి జాదవ్‌ను సురక్షితంగా తీసుకురావాలని అభ్యర్థించారు. అంతేకాకుండా గ్రేటర్ నోయిడాలో ఓ నైజీరియన్‌పై జరిగిన దాడికి సంబంధించి, తరుణ్ విజయ్ జాత్యహంకార కామెంట్ల గురించి, మద్యం నిషేధంపై కూడా తన వ్యూహాలను పంచుకున్నారు. మరో అడుగు ముందుకేసి ఇటీవల తన కామెంట్లను చూస్తున్నవారు ‘నేను రాజకీయాల్లో చేరుతున్నానా అని ప్రశ్నిస్తున్నారు. చాలామంది నేను అవసరం అని తప్పకుండా రాజకీయాల్లోకి రావాలంటున్నారు.
వాస్తవానికి నేను రాజకీయాల్లోకి చేరాలంటే నాకు పెద్ద కష్టమైన పనికాదు.. ఈ 20 ఏళ్లలో ఎప్పుడైనా చేరేవాడిని. నేను రాజకీయాల కోసం, ప్రజల కోసం పనిచేయగలను. నేను మార్పు తీసుకురాగలనని ప్రజలు భావిస్తే తప్పకుండా వస్తాను. అయితే, ముందు నాకంటే ఓ స్థానం సంపాధించుకోవాలి’ అని ఓ మీడియాకు చెప్పారు. దీని ప్రకారం పరోక్షంగా తనకు రాజకీయంపై అభిలాష ఉందని వాద్రా చెప్పారా? ఒక వేళ నిజంగానే ఆయన రాజకీయాల్లో చేరితే ఎప్పుడు చేరుతారు? ఎలా చేరుతారు? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, ఇప్పటికే పలు కేసుల్లో తల మునకలై ఉన్న రాబర్ట్ వాద్రా రాజకీయాల్లోకి రాకపోవచ్చని ఇంకోవర్గం అంటోంది.
అలా చేస్తే, వెంటనే ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా కేంద్రం ముందుకు జరిపించి అడ్డుకుంటుందని, అవినీతి అక్రమాల ఆరోపణలతో రాజకీయాల్లో అడుగుపెట్టి ఆయన క్రియాశీలకంగా పనిచేయలేకపోవచ్చని కూడా అంటున్నారు. ఈ కారణాలవల్లే ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక పూర్తిస్థాయిలో పాల్గొనలేదని, అలా చేస్తే వాద్రా కేసులను బయటపెట్టి అధికార పక్షం ఇబ్బందుల్లో పెట్టే ప్రమాదం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. సమాజ్‌వాది పార్టీతో పొత్తు సమయంలో కాంగ్రెస్ నేతలు వాద్రా సలహా కూడా తీసుకున్నారట.