మీరు అభివృద్ధి చూపగలరా?
ప్రధాని మోదీకి యూపీ సీఎం అఖిలేశ్ సవాల్
► తాను చేసిన అభివృద్ధిని చూపడానికి సిద్ధమని వెల్లడి
బదోహి (ఉత్తరప్రదేశ్): దమ్ముంటే ఈ మూడేళ్లలో చేసిన 10 అభివృద్ధి పనులను ప్రకటించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్.. ప్రధాని నరేంద్రమోదీకి సవాల్ విసిరారు. యూపీలో తాను చేసిన అభివృద్ధి పనులను ప్రకటించడానికి సిద్ధమని పేర్కొన్నారు. ‘‘నా ప్రభుత్వంలో నేను చేసిన 10 పనులను చూపిస్తా. ఆయన (మోదీ) చేసిన 10 పనులను చూపగలరా? నా ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో నేను చేసిన పనులపై నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.
అయితే, ఆయన తన మూడేళ్ల పాలనపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.’’ అని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ శనివారం నిర్వహించిన ర్యాలీలో అఖిలేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నాయని, వారి వద్ద నుంచి డబ్బు తీసుకొని.. ఓటు మాత్రం సైకిల్ గుర్తుకే వేయండని ఓటర్లకు సలహా ఇచ్చారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికీ అఖిలేశ్ చురకలంటించారు.
‘‘సజీవంగా ఉండగానే ఆమె స్మారకం తయారు చేశారు. ఇప్పుడు ఆమె భాషలో కూడా మార్పు వచ్చింది. ఆమె కూడా అభివృద్ధి గురించి మాట్లాడుతోంది. ప్రజలు ఆ మాటలు విని నిద్రలోకి జారుకుంటున్నారు.’’ అని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తన ఐదేళ్ల పాలనలో చేసిన పనులను అఖిలేశ్ ఉద్ఘాటించారు. తనకు మళ్లీ అధికారం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. అధికారంలోకి వస్తే పేద మహిళలకు రూ.1000 పింఛను ఇస్తానని ప్రకటించారు.