ఇక రూ.500 నోట్లపై దృష్టి పెడతాం
న్యూఢిల్లీ: నోట్ల సమస్య రోజురోజుకు తగ్గిపోతోందని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ అన్నారు. ఇప్పటి వరకు రూ.2000 నోట్లు ముద్రించడంపైనే దృష్టి సారించామని, ఇక నుంచి రూ.500 నోట్లను ఎక్కువగా ప్రింట్ చేస్తామని చెప్పారు. 50శాతం నోట్లను ఇప్పటికే మార్చేశామని ఆయన చెప్పారు. కోపరేటివ్ బ్యాంకులకు కూడా డబ్బులు ఇస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు పెద్ద మొత్తంలో డబ్బులు పంపేందుకు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. అలాగే, దూర ప్రాంతాలకు విమానాల్లో డబ్బు పంపిస్తున్నామన్నారు. ఇప్పుడు వస్తున్న కొత్త నోట్లు పూర్తిగా సురక్షితమని ఆయన స్పష్టం చేశారు.
తక్కువ మొత్తాల్లో విత్ డ్రా చేసుకునే వారికోసం రూ.100 నోట్లను ఏడాదికి పంపించేన్ని నోట్లను కేవలం ఐదు వారాల్లోనే మూడింతలు బ్యాంకులకు పంపిచామని చెప్పారు. దేశంలో మొత్తం రెండులక్షల 20 వేల ఏటీఎంలు ఉన్నాయని, వాటిలో రెండులక్షల ఏటీఎంలలో సాఫ్ట్‌వేర్ ఇప్పటికే అవసరానికి తగినట్లుగా మార్చడం జరిగిందన్నారు. అక్రమంగా డబ్బు నిల్వలు ఉంచిన వారిపై, పెద్ద మొత్తంలో నల్లధనం కూడబెట్టిన వారిపై, బ్యాంకు అధికారులపై ఈడీ చర్యలు తప్పక ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈడీ అందుకే అనూహ్య దాడులు చేస్తోందని, వీటిని సర్జికల్ స్ట్రైక్స్ అనుకోవచ్చని చెప్పారు.