అమెరికా వెళ్తారా.. వీసా ఒక్కటే సరిపోదు!
ఢిల్లీ: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే వారికి ఇక వీసా ఒక్కటే సరిపోదు. అందుకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు పక్కాగా ఉండాలి. ఇటీవల పలువురు విద్యార్థులు అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి వీసా దొరికినా కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ దేశ ఎంబసీ మంజూరు చేసిన వీసాల పట్ల అమెరికా బాధ్యత వహించాలని భారత్ కోరింది. అయితే అమెరికా అధికార వర్గాలు మాత్రం విద్యార్థుల సమస్యలకు వీసా స్టేటస్ తో గానీ, యూనివర్సిటీలతో గానీ ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా విద్యార్థుల వ్యక్తిగతమైన అంశమని చెబుతున్నాయి.
బార్డర్ పెట్రోల్ ఏజెంట్కు అందించిన వివరాల్లో స్పష్టత లేకపోవడం వలనే విద్యార్థులు డిపోర్టేషన్ సమస్యలు ఎదుర్కొన్నారని, వీసా స్టేటస్కు దీనికి సంబంధం లేదని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ప్రయాణ డాక్యుమెంట్లతో పాటు ఎక్కడ చదువుతారు, ఎక్కడ ఉంటారు, ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆరోగ్యరక్షణకు ఏం చేస్తారు.. ఇలాంటి అంశాలను విద్యార్థులు చూపించడంలో విఫలమైనందునే వారిని వెనక్కి పంపిస్తున్నట్లు తెలిపారు. పారిస్ దాడుల నేపథ్యంలో భద్రతను సీరియస్గా తీసుకున్న అమెరికా అధికారులు తమ దేశంలోకి ప్రవేశించే వారి విషయంలో నిబంధనలు కఠినతరం చేశారు. తాజా పరిణామాల దృష్ట్యా.. వీసా ఉన్నంత మాత్రాన అమెరికాకు వెళ్లడం కుదరదు.. అన్ని డాక్యుమెంట్లను పక్కాగా ఏర్పాటు చేసుకుంటేనే అమెరికా ప్రయాణం సాఫీగా సాగుతోందని నిపుణులు చెబుతున్నారు.