sufficient
-
తాగునీటికి ఇబ్బందుల్లేవ్!
రాష్ట్రంలో ప్రస్తుత వేసవిలో తాగునీటి కష్టాలు లేనట్టే. సింగూరు, నిజాంసాగర్ మినహా మిగతా ప్రాజెక్టుల్లో నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో తాగునీటికి కటకట తప్పనుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే బ్యారేజీలు, రిజర్వాయర్లు అన్నీ నింపి ఉంచడం, వీటినుంచి చెరువులు సైతం నింపడంతో జూన్లో వర్షాలు సమృద్ధిగా కురిసే వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పుష్కలంగా నీరు... రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్లో భారీ సాగునీటి ప్రాజెక్టుల కింద సుమారు 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. ఈ ఆయకట్టుకోసం 192 టీఎంసీల మేర నీటి వినియోగం చేశారు. ఇందులో గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నుంచి 91, కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నుంచి 101 టీఎంసీల వినియోగం జరిగింది. గోదావరి బేసిన్లో జరిగిన వినియోగంలో అధికంగా కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసిన నీరే 50 టీఎంసీల మేర ఉంది. అయితే ప్రస్తుతం యాసంగి పంటలకు నీటి విడుదల అన్ని ప్రాజెక్టుల పరిధిలో ముగిసింది. సాగు అవసరాలకు నీటి విడుదల ముగిసిన అనంతరం అన్ని ప్రాజెక్టుల కింద తాగునీటికి అవసరమైనంత నీటిని నిల్వ చేసి ఉంచారు. ముఖ్యంగా నాగార్జునసాగర్ పరిధిలో ప్రస్తుతం 194.21 టీఎంసీల నిల్వ ఉన్నప్పటికీ ఇందులో 510 అడుగుల కనీస నీటి మట్టాలకు ఎగువన 63 టీఎంసీల మేర నీటి లభ్యత ఉండగా, తెలంగాణ వాటా కింద 52 టీఎంసీలను వాడుకునేందుకు హక్కు ఉంది. దీంతో పూర్వ నల్లగొండ, ఖమ్మం జిల్లా అవసరాలకు ఢోకా లేదు. ఇక శ్రీశైలంలో 807 అడుగుల వరకు నీటిని తీసుకుంటూ, కల్వకుర్తి తాగునీటి అవసరాలకు 2 టీఎంసీలు కేటాయించగా, అవసరమైతే 800 అడుగుల వరకు నీటిని తీసుకోనున్నారు. గతంలో చాలాసార్లు 800 అడుగుల వరకు వెళ్లిన సందర్భాలున్నాయి. అయితే ఈ నీటిని జూలై వరదలు కొనసాగే వరకు పొదుపుగా వాడుకోవాల్సి ఉంది. ఇక గోదావరిలోని ఎస్సారెస్పీ, మిడ్మానేరు, లోయర్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో సుమారు 70 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. ఇది గత ఏడాది నిల్వలకన్నా ఏకంగా 50 టీఎంసీల మేర అధికం. ఇక నిజాంసాగర్, సింగూరులో మాత్రం చుక్క నీరు లేదు. ఇక్కడ జూలై వర కు కనీసంగా 3 నుంచి 4 టీఎంసీల నీటి అవసరాలు ఉన్నాయి. ఈ నీటికోసం ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయం ఆలోచిస్తుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46 వేలకు పైగా చెరువుల్లో సగానికి పైగా చెరువుల్లో యాభై శాతంకన్నా అధిక నీటి నిల్వ ఉంది. ఈ నీరు గ్రామాల్లోని పశువుల తాగునీటి అవసరాలను తీర్చనున్నాయి. -
గట్టెక్కించిన సీలేరు
అమలాపురం : గోదావరి డెల్టాలో రబీ వరిసాగు గట్టెక్కింది. శివారుకు సకాలంలో సాగునీరందకున్నా.. గోదావరిలో పంపులు ఏర్పాటు చేసి వృథా జలాలను కాలువల ద్వారా చేలకు మళ్లించకున్నా.. సొంతంగా మోటార్లు పెట్టుకున్న రైతులకు ప్రభుత్వం డీజిల్ ఖర్చులివ్వకున్నా.. మురుగునీటి కాలువలపై సకాలంలో క్రాస్బండ్లు వేయకున్నా.. చంద్రబాబు సర్కార్ పైసా విదల్చకున్నా.. డెల్టాలో రబీ పంట పండింది. 16 టీఎంసీల నీటికొరత ఉంటుందని అధికారులు చెప్పినా.. అంచనాలకు మించి నీరు రావడంతో రబీసాగు నీటి ఎద్దడికి ఎదురొడ్డి నిలిచింది. అదెలా సాధ్యమయ్యిందంటే.. ఎద్దడి సమయంలో గోదావరి డెల్టాలో రబీసాగును ‘సీలేరు’ ఎప్పటిలానే ఒడ్డున పడేసింది. ఈసారి రికార్డు స్థాయిలో ఆదివారం నాటికి ఏకంగా 66.056 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదలడం ద్వారా.. ఉభయ గోదావరి జిల్లాల్లోని సుమారు 7 లక్షల మంది రైతులకు జీవనాధారమైన రబీ సాగు నిర్విఘ్నంగా పూర్తయ్యింది. నీటి ఎద్దడి ఉందన్నా.. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ దిగువన ప్రధాన పంట కాలువలకు ఈ నెల 10 నుంచి నీటి సరఫరాను నిలిపివేస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించిన విçషయం తెలిసిందే. శివార్లలో సాగు ఆలస్యమైనందున మరో ఐదు రోజులు గడువు పొడిగించాలని రైతులు కోరుతున్నారు. రబీ సాగుకు ఈ ఏడాది ఎద్దడి తప్పని అధికారులు ముందే చెప్పారు. రబీ షెడ్యూలు కాలంలో తాగు, పారిశ్రామిక అవసరాలకు పోగా, కేవలం సాగుకు 83 టీఎంసీల నీరు అవసరమని, నీటి లభ్యత 67 టీఎంసీలు మాత్రమే ఉంటుందని తేల్చారు. అయినప్పటికీ మొత్తం ఆయకట్టుకు సాగునీరందించాలని జిల్లాకు చెందిన మంత్రులు, అధికార పార్టీ పెద్దలు సూచించారు. కానీ, వివిధ పద్ధతుల్లో నీటి సేకరణకు ప్రభుత్వం నుంచి నయాపైసా కూడా మంజూరు చేయించలేదు. తాంబూలాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండన్నట్టుగా డెల్టాలో రైతులను, నీటిపారుదల అధికారులను గాలికి వదిలేశారు. దీంతో రైతులు ఉన్న నీటినే పొదుపుగా వాడుకొని రబీని గట్టెక్కించారు. సీలేరు నుంచి రికార్డు స్థాయిలో నీటి సేకరణ అధికారుల అంచనాలకు తగ్గట్టుగానే గోదావరిలో సహజ జలాలు తక్కువగా వచ్చాయి. గోదావరి సహజ జలాల అంచనా 24 టీఎంసీలు కాగా, ఆదివారం నాటికి 22.754 టీఎంసీల నీరు వచ్చింది. ఇది అధికారుల అంచనాకన్నా సుమారు ఒక్క టీఎంసీ తక్కువ. ఇదే సమయంలో మనకు సీలేరు నుంచి 49 టీఎంసీల వరకూ నీరు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. వాస్తవానికి రబీ కాలంలో సీలేరు నుంచి మనకు వచ్చే నీరు 40 టీఎంసీలే. అత్యవసర పరిస్థితుల్లో బైపాస్ పద్ధతిలో మరో 5 టీఎంసీల వరకూ తెచ్చుకోవచ్చు. ఎందుకైనా మంచిదని సీలేరు నుంచి 49 టీఎంసీలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. అయితే వారి అంచనాలకు మించి ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో ఏకంగా 66.056 టీఎంసీల నీరు సేకరించారు. కాలువలు మూసేనాటికి మరో రెండు టీఎంసీలు కలిపితే 68.056 టీఎంసీలు సీలేరు నుంచి సేకరించినట్టవుతుంది. ఇప్పటికీ సీలేరు నుంచే.. డెల్టా ప్రధాన పంట కాలువలైన తూర్పు డెల్టాకు 1,825, మధ్య డెల్టాకు 1,190, పశ్చిమ డెల్టాకు 3,175 క్యూసెక్కుల చొప్పున మొత్తం 6,190 క్యూసెక్కుల నీరు ఇస్తున్నారు. దీనిలో సహజ జలాలు 1,032 క్యూసెక్కులు కాగా, సీలేరు నుంచి వస్తున్నది 5,158 టీఎంసీలు కావడం విశేషం. ఇప్పటికీ బైపాస్ పద్ధతిలో నీరు తీసుకువస్తున్నారంటే గోదావరి డెల్టాకు సీలేరు ప్రాధాన్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. పవర్ డ్రాప్ నుంచి అత్యధికంగా 4 వేల క్యూసెక్కులు, బైపాస్ పద్ధతిలో మరో 2 వేల క్యూసెక్కుల చొప్పున 6 వేల క్యూసెక్కులు సేకరించేవారు. కానీ ఈసారి ఏకంగా కొన్ని రోజుల పాటు 7,500 వరకూ సీలేరు నుంచి సేకరించాల్సి వచ్చింది. -
రూ.100 నోట్లు సిద్ధంగా ఉన్నాయ్..!
ముంబై: బ్లాక్ మనీపై దేశ ప్రధానమంత్రి సర్జికల్ స్ట్రైక్స్ పై ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చురుగ్గా కదులుతోంది. రూ.500, రూ. 1000 నోట్ల చలామణి రద్దుపై ఆందోళన చెందాల్సి అవసరం లేదన్న సంకేతాలు అందించింది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో తమ అన్ని బ్రాంచ్ లోలనూ, ఏటీ ఎం కేంద్రాలలోనూ సరిపడినన్ని 100 రూపాయల నోట్ల నిల్వలు రడీగా ఉన్నాయని అధికారికంగా ప్రకటించింది. నవంబరు 11 నుంచి ఏటీఎం కేంద్రాలు సిద్ధంగా ఉంటాయని తెలిపింది. మరోవైపు దాదాపు అన్ని బ్యాంకులు రేపు (గురువారం) సెలవు పాటిస్తుండగా, సాయంత్రం ఆరుగంటల వరకు తమ బ్యాంకులు పని చేస్తాయని, 10 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చని ఎస్బీఐ ప్రకటించింది. అలాగే తమ ఖాతాల్లో రూ.500, రూ. 1000 నోట్ల డిపాజిట్లకు ఎలాంటి లిమిట్ లేదని వెల్లడించింది. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంచలన నిర్ణయంతో తాజాగా 100 నోటు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. రూ.500, రూ. 1000 నోట్ల చలామణి రద్దు చేయడంతో ప్రజల్లో రూ.100 నోటుపై విపరీతమైన క్రేజ్ పెరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. -
అమెరికా వెళ్తారా.. వీసా ఒక్కటే సరిపోదు!
ఢిల్లీ: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే వారికి ఇక వీసా ఒక్కటే సరిపోదు. అందుకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు పక్కాగా ఉండాలి. ఇటీవల పలువురు విద్యార్థులు అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి వీసా దొరికినా కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ దేశ ఎంబసీ మంజూరు చేసిన వీసాల పట్ల అమెరికా బాధ్యత వహించాలని భారత్ కోరింది. అయితే అమెరికా అధికార వర్గాలు మాత్రం విద్యార్థుల సమస్యలకు వీసా స్టేటస్ తో గానీ, యూనివర్సిటీలతో గానీ ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా విద్యార్థుల వ్యక్తిగతమైన అంశమని చెబుతున్నాయి. బార్డర్ పెట్రోల్ ఏజెంట్కు అందించిన వివరాల్లో స్పష్టత లేకపోవడం వలనే విద్యార్థులు డిపోర్టేషన్ సమస్యలు ఎదుర్కొన్నారని, వీసా స్టేటస్కు దీనికి సంబంధం లేదని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ప్రయాణ డాక్యుమెంట్లతో పాటు ఎక్కడ చదువుతారు, ఎక్కడ ఉంటారు, ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆరోగ్యరక్షణకు ఏం చేస్తారు.. ఇలాంటి అంశాలను విద్యార్థులు చూపించడంలో విఫలమైనందునే వారిని వెనక్కి పంపిస్తున్నట్లు తెలిపారు. పారిస్ దాడుల నేపథ్యంలో భద్రతను సీరియస్గా తీసుకున్న అమెరికా అధికారులు తమ దేశంలోకి ప్రవేశించే వారి విషయంలో నిబంధనలు కఠినతరం చేశారు. తాజా పరిణామాల దృష్ట్యా.. వీసా ఉన్నంత మాత్రాన అమెరికాకు వెళ్లడం కుదరదు.. అన్ని డాక్యుమెంట్లను పక్కాగా ఏర్పాటు చేసుకుంటేనే అమెరికా ప్రయాణం సాఫీగా సాగుతోందని నిపుణులు చెబుతున్నారు.