రూ.100 నోట్లు సిద్ధంగా ఉన్నాయ్..!
ముంబై: బ్లాక్ మనీపై దేశ ప్రధానమంత్రి సర్జికల్ స్ట్రైక్స్ పై ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చురుగ్గా కదులుతోంది. రూ.500, రూ. 1000 నోట్ల చలామణి రద్దుపై ఆందోళన చెందాల్సి అవసరం లేదన్న సంకేతాలు అందించింది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో తమ అన్ని బ్రాంచ్ లోలనూ, ఏటీ ఎం కేంద్రాలలోనూ సరిపడినన్ని 100 రూపాయల నోట్ల నిల్వలు రడీగా ఉన్నాయని అధికారికంగా ప్రకటించింది. నవంబరు 11 నుంచి ఏటీఎం కేంద్రాలు సిద్ధంగా ఉంటాయని తెలిపింది. మరోవైపు దాదాపు అన్ని బ్యాంకులు రేపు (గురువారం) సెలవు పాటిస్తుండగా, సాయంత్రం ఆరుగంటల వరకు తమ బ్యాంకులు పని చేస్తాయని, 10 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చని ఎస్బీఐ ప్రకటించింది. అలాగే తమ ఖాతాల్లో రూ.500, రూ. 1000 నోట్ల డిపాజిట్లకు ఎలాంటి లిమిట్ లేదని వెల్లడించింది.
కాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంచలన నిర్ణయంతో తాజాగా 100 నోటు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. రూ.500, రూ. 1000 నోట్ల చలామణి రద్దు చేయడంతో ప్రజల్లో రూ.100 నోటుపై విపరీతమైన క్రేజ్ పెరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.