సిల్చార్ ఎయిర్‌పోర్టులో తృణమూల్ బృంద సభ్యులను అడ్డుకుంటున్న పోలీసులు
సిల్చార్/న్యూఢిల్లీ: నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్నార్సీ) తుది ముసాయిదాపై ఆందోళనల నేపథ్యంలో అస్సాంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితిని అంచనావేయడానికి గురువారం అక్కడికి వెళ్లిన తృణమూల్ బృందాన్ని పోలీసులు సిల్చార్ విమానాశ్రయంలో అడ్డుకుని నిర్బంధించారు. వారి పర్యటన శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అస్సాం అధికారులు తెలిపారు. ఎన్నార్సీ జాబితాలో భారతీయుల పేర్లు గల్లంతవడంపై స్థానిక ఆడిటోరియంలో సమావేశం నిర్వహించేందుకు ఆరుగురు ఎంపీలు, పశ్చిమబెంగాల్ మంత్రి, ఎమ్మెల్యేతో కూడిన తృణమూల్ బృందం అస్సాం వెళ్లింది.
విమానాశ్రయంలోనే బైఠాయింపు..
తృణమూల్ బృందం విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకుని వీఐపీల గదిలో నిర్బంధించారు. దీంతో వారు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ఎంపీ సుఖేందర్ శేఖర్ రాయ్ ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ ‘మహిళా సభ్యులతో సహా మా అందరిపై భౌతిక దాడి జరిగింది. ఎన్నార్సీ జాబితాలో చోటుదక్కని వారితో మాట్లాడటానికే ఇక్కడికి వచ్చాం.కానీ పోలీసులు మమ్మల్ని విమానాశ్రయం నుంచి బయటికి వెళ్లేందుకు అనుమతించలేదు’ అని అన్నారు.
బీజేపీపై మమత మండిపాటు
అస్సాంలో తమ పార్టీ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంపై మమతా బెనర్జీ స్పందించారు. దేశంలో బీజేపీ సూపర్ ఎమర్జెన్సీని అమలుచేస్తోందని మండిపడ్డారు. ఏ చట్టం ప్రకారం ప్రతినిధులను అడ్డుకున్నారని నిలదీశారు. ‘ ఎన్నార్సీ జాబితాకు సంబంధించి ఎవరినీ వేధింపులకు గురిచేయమని హోం మంత్రి రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు. కానీ మా ఎంపీలను సిల్చార్ విమానాశ్రయం నుంచి అడుగు బయటపెట్టనీయలేదు. పోలీసులు భౌతిక దాడికి పాల్పడ్డారు. బీజేపీ తన బలంతో నిజాలను తొక్కిపెడుతోంది’ అని మమత ధ్వజమెత్తారు. ఈ అంశాన్ని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ లోక్‌సభలో లేవనెత్తారు. అస్సాం దేశంలో భాగమేనని, అయినా ఎంపీలు అక్కడ అడుగుపెట్టకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. అస్సాం ప్రభుత్వంపై శుక్రవారం సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు.
దేశమంతా ఎన్నార్సీ: బీజేపీ సభ్యుడు
దేశమంతా ఎన్నార్సీ నిర్వహించాలని అధికార బీజేపీ సభ్యుడు నిశికాంత్ దూబే లోక్‌సభలో డిమాండ్ చేశారు. పలు ఈశాన్య రాష్ట్రాలు సహా కశ్మీర్‌లో జనాభా లెక్కలు సమగ్రంగా నిర్వహించలేదన్నారు. దూబే వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు.. స్పీకర్ సర్దిచెప్పడంతో శాంతించాయి. మరోవైపు, దళితులపై వేధింపుల నిరోధక చట్టం, ఎన్నార్సీ అంశాలు గురువారం పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించాయి.
Comments
Please login to add a commentAdd a comment