రాజధానిలో శవాల గుట్టలు!
మహిళలపై అత్యాచారాల్లో టాప్ నగరంగా అపఖ్యాతి.. గ్యాంగ్ వార్ లో భాగంగా ప్రతిరోజూ ప్రతీకార హత్య లు.. ఇవి చాలదన్నట్లు భారీగా పెరిగుతోన్న గుర్తుతెలియని శవాలు.. ఇదీ మన దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలోని వాస్తవ పరిస్థితి. గడిచిన నాలుగు నెలల్లో ఆ నగరంలో మొత్తం 962 గుర్తుతెలియని మృతదేహాలు లభించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్థీబాబ్ చౌదరి బుధవారం సాక్షాత్తు పార్లమెంట్ లో ప్రకటించడడాన్ని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు.
బీజేడీ ఎంపీ వైష్ణవ్ పరీదా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఢిల్లీలో ప్రతిరోజు సగటున ఎనిమిది మృతదేహాలు లభిస్తున్నాయని మంత్రి బదులిచ్చారు. అంతేకాకుండా రోడ్డుపక్కన నిస్సహాయంగా పడిఉండే వృద్ధులు, అనారోగ్యం బారిన పడి ఉండే వారిని స్థానిక పోలీసులు వెంటనే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారని వెల్లడించారు.