టీవీలకు అతుక్కుపోతున్నారు! | Number of TV viewers is growing | Sakshi
Sakshi News home page

టీవీలకు అతుక్కుపోతున్నారు!

Published Sun, Sep 2 2018 3:01 AM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Number of TV viewers is growing - Sakshi

ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్, హాట్‌స్టార్‌ వంటి సామాజిక మాధ్యమాలు ఎన్ని వచ్చినా టీవీ చూసే వారి సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉందని, ఈ విషయంలో దక్షిణ భారతీయులు ముందున్నారని తాజా సర్వేలో తేలింది. ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణ భారతంలోనే ఎక్కువ టీవీలు ఉన్నాయని బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ (బార్క్‌) నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. దక్షిణ భారత్‌లో 99.9% ఇళ్లకు విద్యుత్‌ సదుపాయం ఉండటం, దక్షిణ భారతీయులు మొదట కొనే గృహోపకరణం టీవీయే కావడం దీనికి కారణమని బార్క్‌ సీఈవో దాస్‌గుప్తా తెలిపారు. 4,300 పట్టణాల్లో 3 లక్షల మందిని సర్వే చేసి బార్క్‌ ‘బ్రాడ్‌కాస్ట్‌ ఇండియా సర్వే పేరుతో నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం 5 దక్షిణ రాష్ట్రాల్లో 95 శాతం ఇళ్లలో టీవీలు ఉన్నాయి.

తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 25.9 కోట్ల టీవీలు ఉన్నాయి. 2016తో పోలిస్తే ఇది 8 శాతం ఎక్కువ. ఉత్తర భారతంలో 20.9 కోట్లు, పశ్చిమ భారతంలో 22.1 కోట్లు, తూర్పు భారతంలో 14.6 కోట్ల టీవీలు ఉన్నాయి. దేశం మొత్తం మీద టీవీ ప్రేక్షకుల సంఖ్య 66 శాతం ఉండగా, దక్షిణ భారత దేశంలో అది 95 శాతంగా ఉంది. దేశంలో టీవీ ఉన్న ఇళ్ల సంఖ్య 2018లో 19.7 కోట్లకు చేరింది. 2016తో పోలిస్తే ఇది 7.5% ఎక్కువ. అలాగే టీవీ ప్రేక్షకుల సంఖ్య కూడా 83.6 కోట్లకు (7.2% ఎక్కువ) చేరింది. పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10 మందిలో 87 మంది రోజులో 4 గంటల 10 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 3 గంటల 27 నిమిషాలు టీవీ చూస్తున్నారు. దక్షిణ భారతంలో టీవీ చూసే సమయం ఏటా పెరుగుతోంది. 2016 నుంచి టీవీ ప్రేక్షకుల సంఖ్య 12 శాతం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో టీవీ ఉన్న ఇళ్ల సంఖ్య 2018లో 10 శాతం పెరగ్గా, పట్టణ ప్రాంతాల్లో 4% పెరిగింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement