న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చట్టం రూపుదిద్దుకోవడానికి చాలా సమయం పడుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ అన్నారు. మంగళవారం ఆయన నూతన సీఈసీగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 2019లో ఏకకాలంలో ఎన్నికలు జరుగుతాయా? లేదా? అని చెప్పేందుకు తాను తగిన వ్యక్తిని కాదన్నారు.
‘ఎన్నికల ప్రక్రియను తారుమారు చేయలేం. ఎన్నికల నిర్వహణలో తలెత్తే సమస్యలన్నీ సంబంధిత చట్టానికి లోబడి ఉంటాయి. తగిన చట్టం అందుబాటులోకి వచ్చే వరకు ఒకేసారి ఎన్నికల నిర్వహణపై చర్చించాల్సిన అవసరం లేదు. రాజ్యాంగ సవరణ చేసి ఇందుకోసం చట్టం రూపొందించేందుకు చాలా సమయం పడుతుంది’ అని అన్నారు.
ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై 2015లోనే ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం అడిగిందని, అందుకోసం రాజ్యాంగం, ఎన్నికల చట్టాల్లో సవరణలు చేయడంతో పాటు అదనంగా ఈవీఎంలు, పోలింగ్ సిబ్బంది, రూ.9 వేల కోట్లు ఖర్చవుతాయని బదులిచ్చామని చెప్పా రు. సుప్రీంకోర్టు ఆదేశాలననుసరించి ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ అనుసంధానాన్ని నిలి పేశామని, కానీ నకిలీలను గుర్తించేలా సీడింగ్ పునఃప్రారంభించడానికి అనుమతివ్వాలని మళ్లీ కోర్టును ఆశ్రయించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment