'మండే టెస్ట్' పాస్.. ఢిల్లీవాలా రిలీఫ్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కేజ్రీవాల్ సర్కార్ అమల్లోకి తెచ్చిన 'సరి-బేసి' అంకెల విధానం 'మండే టెస్ట్'లో దాదాపు పాస్ అయినట్టు కనిపిస్తోంది. 'సరి-బేసి' వాహన నెంబర్ ప్లేట్ల విధానం జనవరి 1 తేదీన అమల్లోకి వచ్చినప్పటికీ, ఈ మూడురోజులు వారాంతపు సెలవులు కావడంతో దీని ప్రభావం ప్రధానంగా సోమవారం తెలుస్తోందని సర్వత్రా భావించారు. అంతా అనుకున్నట్టే సోమవారం 'సరిసంఖ్య' నెంబర్ కలిగిన వాహనాలు మాత్రమే రోడ్లు ఎక్కాయి. సరిసంఖ్య వాహనం లేనివాళ్లు ప్రజారవాణా వ్యవస్థపై ఆధారపడ్డారు. దీంతో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయి కనిపించాయి.
కొన్నిచోట్ల ఈ విధానాన్ని ఉల్లంఘిస్తూ 'బేసి' సంఖ్య కలిగిన వాహనాలు రోడ్లు ఎక్కడంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు దాదాపు 200 మందికి జరిమానా విధించారు. ఈ విధానం అమలు విషయంలో ప్రముఖులకు కూడా ఎలాంటి మినహాయింపు ఉండదని ఢిల్లీ పోలీసు స్పెషల్ కమిషనర్ ముక్తేశ్ చందర్ తెలిపారు. ఈ విధానాన్ని ఉల్లంఘించిన ఓ వీఐపీకి ఆయన స్వయంగా చలాన్ విధించారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ట్రాఫిక్ విధానానికి అనుగుణంగా తన కారును పక్కనబెట్టారు. రవాణాశాఖ మంత్రి గోపాల్ రాయ్ టాటా నానో కారులో ఆయనతోపాటు కలిసి కేజ్రీవాల్ సెక్రటేరియట్ కు పయనమయ్యారు.
ట్రాఫిక్ చిక్కులు తప్పడంతో రిలీఫ్
ఢిల్లీ రోడ్ల మీద సాధారణంగా భారీ ట్రాఫిక్ ఉంటుంది. అందుకు భిన్నంగా సోమవారం దర్శనమిచ్చింది. సహజంగా ట్రాఫిక్ ఉండే జంక్షన్లు కూడా 'సరి-బేసి' విధానం కారణంగా సాధారణంగా కనిపించాయి. నూతన విధానం వల్ల భారీ సంఖ్యలో కార్లు రోడెక్కకపోవడంతో హస్తినలో పెద్దగా ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాలేదంటూ ఢిల్లీ వాసులు ట్విట్టర్ లో ఆనందం వ్యక్తం చేశారు. 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ల ఆధారంగా దినం తప్పించి దినం కార్లను రోడ్లకు మీదకు అనుమతిస్తూ కేజ్రీవాల్ సర్కార్ తెచ్చిన ఈ విధానంపై కొందరు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకోవడానికి ప్రైవేటు వాహనదారులు ప్రయత్నిస్తున్నారని, ముఖ్యంగా క్యాబ్ల చార్జీలను విపరీతంగా పెంచారని మరికొందరు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.