విద్యార్థులకు సీఎం విజయమంత్రం
ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యాపకుడి అవతారం ఎత్తారు. కరేజ్, కన్విక్షన్, కమిట్‌మెంట్ అనే మూడు 'సి'లతో కూడిన విజయమంత్రాన్ని విద్యార్థులకు బోధించారు. జీవితంలో విజయం సాధించాలంటే ఈ మూడు పదాలు తప్పనిసరిగా అవసరమని ఆయన చెప్పారు. రాష్ట్రస్థాయి విద్యార్థుల సదస్సులో మాట్లాడిన పట్నాయక్.. విద్యార్థులకు జీవిత పాఠాలు బోధించారు. ఏదైనా ఒక అంశానికి కట్టుబడి ఉంటే.. నిబద్ధత, ధైర్యాలతో ముందుకెళ్లాలని, అప్పుడు తప్పనిసరిగా జీవితంలో విజయం సాధించి తీరుతారని ఆయన అన్నారు. బిజూ జనతాదళ్ (బీజేడీ) విద్యార్థి విభాగం ఈ సదస్సును నిర్వహించింది.
విద్యార్థులు, యువత భాగస్వామ్యంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి విద్యార్థులకు తెలిపారు. గతంలో రాష్ట్రంలో నెలకొన్న కరువు గురించి ప్రస్తావిస్తూ.. ఒడిషాకు ప్రకృతి విపత్తులు కొత్తేమీ కాదని ఆయన తెలిపారు. వరదలు, తుపాన్లు, కరువు లాంటి పరిస్థితులను వరుసపెట్టి గత 15 ఏళ్లుగా ఎదుర్కొంటూనే ఉన్నామని, ప్రస్తుత కరువు పరిస్థితిని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పట్నాయక్ చెప్పారు.