న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. దేశంలోని మూడు ప్రతిష్టాత్మక యూనివర్శిటీల వెబ్‌సైట్లను హ్యాక్ చేశారు. ఢిల్లీ యూనివర్శిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ, ఐఐటీ ఢిల్లీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఢిల్లీ) అధికారిక వెబ్‌సైట్ల మంగళవారం హ్యాకింగ్‌కు గురయ్యాయి.
హ్యాకింగ్కు పాల్పడిన గ్రూప్ తనను తాను ‘పీహెచ్‌సీ’గా పేర్కొంటూ... తాము ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా వివరించారు. ఆ వెబ్‌సైట్లలో 'పీహెచ్‌సీ' అని ప్రో కాశ్మీర్ స్లోగ్లన్లను హ్యాకర్స్ పోస్ట్ చేశారు. కశ్మీర్లో సో కాల్డ్ జవాన్లు ఏం చేస్తున్నారో తెలుసా అంటూ... సైనికుల హింసాకాండను నిరసిస్తూ హ్యాకర్లు నేరుగా భారత ప్రభుత్వానికి, ప్రజలను సంభోదిస్తూ మెసేజ్లు పెట్టారు.
అలాగే ’ మీ సోదరుడు, సోదరి, తల్లీదండ్రులను చంపితే మీకెలా అనిపిస్తుంది. మిమ్మల్ని, మీ కుటుంబాలను నాశనం చేస్తే మీరేం చేస్తారంటూ ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ హ్యాకర్లు పోస్ట్ చేశారు. కాగా చాలావరకూ సెంట్రల్ యూనివర్శిటీ వెబ్‌సైట్లను నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్ నిర్వహిస్తోంది. మరోవైపు హ్యాక్ అయిన కొద్ది గంటల అనంతరం వెబ్‌సైట్లను పునరుద్దరించారు.