ఈ-ఆటో రిక్షాలను ఎక్కుదామా?
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణకు దోహదపడడమే కాకుండా ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే ఈ-ఆటోరిక్షాల ఉత్పత్తిని ‘ఓకే ప్లే ఇండియా’ కంపెనీ ప్రారంభించింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో ఈ-ఆటోరిక్షాను తయారు చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఇప్పటి వరకు చైనా నుంచి దిగుమతి చేసుకునే పరికరాలతోనే ఈ-ఆటో రిక్షాలను తయారు చేస్తున్నారు. ఆట బొమ్మలను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన ఓకే ప్లే ఇండియా, ఆటో మొబైల్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్న విషయం తెల్సిందే.
పరిశ్రమలో రెండేళ్లపాటు పరిశోధనలు చేసి దీన్ని తయారు చేసినట్టు కంపెనీ మేనేజింగ్ డెరైక్టర్ రాజన్ హండా మీడియాకు తెలిపారు. ఆటోరిక్షాకు అనుసంధానించే మోటార్ బైక్ మినహా మిగతా బాడీ అంతా ప్లాస్టిక్‌తోనే తయారు చేసినట్టు ఆయన చెప్పారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ సామాగ్రిని పెట్టుకోవడంగానీ, డ్రైవర్ కూడా తనకు అవసరమైన సామాగ్రిని చక్కగా అమర్చుకోవడానికి వీలుగా బాడీని తీర్చిదిద్దామని ఆయన వివరించారు. హర్యానాలోని సొహ్నా వద్ద, తమిళనాడులోని రాణిపేట్‌లో ఏర్పాటు చేసిన తమ ప్లాంటులకు ఏడాదికి మూడు లక్షల ఆటోరిక్షాలను ఉత్పత్తిచేసే సామర్థ్యం ఉందని చెప్పారు.
320 కిలోల బరువుండే ఈ ఆటోరిక్షాలు 700 కిలోల బరువును లాక్కెళ్లగలవు. ఒక్కసారి బ్యాటరీ చార్జిచేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించే ఈ రిక్షాలు గంటకు 24 కిలీమీటర్ల గరిష్ట వేగంతో నడుస్తాయి. ఎల్‌ఈడీ హెడ్‌లైట్లను ఉపయోగించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముందుకు, వెనక్కి వెళ్లేందుకు వీలుగా స్విచ్‌లు ఏర్పాటు చేశారు. హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్ వ్యవస్థలు గల రెండు రకాలు లభిస్తాయి. లక్షా పదిహేను వేల రూపాయల నుంచి లక్షా పాతిక వేల రూపాయల మధ్యలో లభించే ఈ రిక్షాలను ప్రపంచవ్యాప్తంగా విక్రయించేందుకు కంపెనీ ‘ఇంటర్ నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటివ్ టెక్నాలజీ (ఐసీఏటీ) ఆమోదం కూడా పొందింది. ఈ రిక్షాలకు కంపెనీ ‘ఇ-రాజా’ అని పేరు పెట్టింది.