తిరువనంతపురం : కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు ఉద్యోగుల నెల జీతంలో కోత విధిస్తూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనకు రాష్ర్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులతోపాటు రాష్ట్ర అనుబంధ పరిశ్రమలు, యూనివర్శిటీలు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల నెల జీతంనుంచి 6రోజుల జీతంలో కోత విధిస్తారు. అంటే ఒక నెల జీతాన్ని వాయిదాల వారీగా ఐదు నెలలపాటు 6రోజుల జీతం కట్ చేస్తారన్నమాట. అయితే 20 వేల లోపు జీతాలున్నవారు, పెన్షనర్లకు మినహాయింపునిచ్చారు. ఈ ప్రక్రియ ఐదు నెలలపాటు కొనసాగనుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు.
ఈ డెడక్షన్ డబ్బును ఒక నిర్దిష్ట కాల పరిమితి తర్వాత తిరిగి వారికే చెల్లిస్తారు. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరికీ ఏడాదిపాటు వారి జీతాలు, గౌరవవేతనాల్లో 30 శాతం కోత విధిస్తామని సీఎం పినరయి విజయన్ తెలిపారు. పన్నులు వసూలు గణనీయంగా తగ్గడంతోపాటు ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో తాము జీతాల్లో కోత విధించాలని నిర్ణయించామని సీఎం పేర్కొన్నారు. అంతకుముందు 2018లో కేరళ వరద సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో నెల జీతాన్ని కోత విధిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించడంతో ఉద్యోగ సంఘాలు హైకోర్టులో సవాలు చేశాయి. దీంతో ఈసారి ఒకేసారి నెల జీతంలో కోత విధించకుండా నెలలో 6 రోజుల జీతంలో కోత ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా ఈ డబ్బును ఒక నిర్దిష్ట కాల పరిమితి తర్వాత తిరిగి చెల్లిస్తామని తెలిపింది. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని , ఉద్యోగులు దీనికి సహకరించాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment