తిరువనంతపురం : గతవారం వరకు ప్రశాంతంగా ఉన్న కేరళలో కరోనా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. తాజాగా మరో 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గడిచిన నాలుగు రోజులుగా కొత్త కేసులు నమోదువుతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. దేశంలో తొలి కరోనా కేసు కేరళలోనే నమోదు అయినప్పటికీ ప్రభుత్వం, అధికారులు, ప్రజల కఠిన చర్యలతో వైరస్‌ను పూర్తిగా కట్టడి చేయగలిగారు. జీరో కరోనా పాజిటివ్ కేసులతో దేశమంతా కేరళ వైపు తిరిగిచూసే విధంగా ఆ రాష్ట్ర ప్రజలు వైరస్‌పై యుద్ధంలో విజయం సాధించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముందే ఊహించిన విధంగా విదేశాల నుంచి వచ్చిన వారు కొత్త సమస్యను తెచ్చిపెడుతున్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి వల్ల మళ్లీ పరిస్థితి తిరిగి మొదటి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు కొత్తగా నమోదయ్యే కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే అని తెలిసింది. (స్వదేశానికి రాక.. కరోనా పాజిటివ్)
విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారికి ముందుగానే పరీక్షలు నిర్వహించిన క్వారెంటైన్ కేంద్రాలకు పంపుతున్నామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. మొత్తం 600కుపైగా పరీక్షలు నిర్వహించగా 68 పాజిటివ్ కేసులు తేలినట్లు వెల్లడించారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారిలోనే ఎక్కువ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కాగా లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తరలించడంతో పెను ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్ర ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించిన విషయం తెలిసిందే. వారికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా స్వదేశానికి తీసుకురావడం సరైన విధానం కాదని కేంద్రానికి తెలియజేశారు. ఈ మేరకు మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజయన్ లేఖ రాశారు. (స్వదేశానికి తరలింపు.. పెను ప్రమాదం!)
Comments
Please login to add a commentAdd a comment