ప్రతి ఐదు నిమిషాలకో గర్భిణి మృతి!
ముంబై: దేశంలో ప్రతి ఐదు నిమిషాలకో గర్భిణి మృతి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదివారం తెలిపింది. గర్భం మోస్తున్నప్పుడు, ప్రసవం సమయంలో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. ఏటా ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్న గర్భిణుల్లో 25.7 శాతం మంది భారతీయ మహిళలే ఉంటున్నారు. వీటిలో మూడింట రెండు వంతులు ప్రసవం తర్వాత సంభవిస్తున్న మరణాలే.
కాన్పు సమయంలో అధిక రక్తస్రావమే ఇందుకు కారణం. ప్రతీ లక్ష మంది గర్భిణుల్లో 83 మందికి ప్రసవం తర్వాత గర్భసంచి తొలగించాల్సి వస్తోంది. కాన్పు సమయంలో అర్ధలీటరు నుంచి లీటరు వరకు రక్తం పోతే దాన్ని అధిక రక్తస్రావంగా భావిస్తారు. ప్రసూతి మరణాలు అస్సాంలో అత్యధికంగా, కేరళలో అత్యల్పంగా నమోదవుతున్నాయి.