ఏటీఎం, పేటీఎంలు ఇక అక్కర్లేదు!
న్యూఢిల్లీ: ఏటీఎం, పేటీఎంలకు ప్రాతినిధ్యం తగ్గనుంది. చెల్లింపులకోసం ఉపయోగించే ఇతర ప్రైవేటు యాప్‌లకు కూడా కేంద్రం తీసుకొస్తున్న కొత్త యాప్‌తో షాక్ గా మారనుంది. నగదురహిత లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్థి చేసిన 'ఆధార్ పేమెంట్ యాప్' రేపు (డిసెంబర్ 25)న ప్రారంభించబోతున్నారు. నోట్ల రద్దు తరువాత అనేక పరిణామాలు చోటుచేసుకోవడం డిజిటల్ చెల్లింపుల పై పలు విమర్శలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఈ యాప్ అందుబాటులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆన్‌లైన్ చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పెట్ ప్రాజెక్టు 'ఆధార్ పేమెంట్ యాప్'ను రేపు(ఆదివారం) ప్రారంభించనున్నారు. దీంతో ఇక నుంచి డెబిట్/క్రెడిట్ కార్డులు, పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్ల అవసరం అమాంతం తగ్గిపోనుంది. ఒక్కసారి ఈ యాప్ ప్రారంభం అయిన తర్వాత ఆన్ లైన్ పేమెంట్లకు చార్జీలు వసూలు చేసే మాస్టర్ కార్డు, వీసా కార్డులాంటి సంస్థలకు ఇక తిరుగుండదని కూడా ఊహాగానాలు వెలువడుతున్నాయి. గ్రామాల్లోని చిన్నచిన్న చల్లర వర్తకులు కూడా ఈ యాప్ చాలా ఉపయోగపడనుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లలో చాలా తేలికగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఐడీఎఫ్‌సీ బ్యాంక్, యూఐడీఏఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలు ఈ యాప్‌ను సంయుక్తంగా అభివృద్థి చేసినట్లు సమాచారం. ఈ యాప్‌ను తొలుత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీన్ని బయోమెట్రిక్ రీడర్‌కు అనుసంధానించాల్సి ఉంటుంది. అనంతరం వేలి ముద్రను బయోమెట్రిక్ రీడర్ పై ఉంచి కస్టమర్ ఆధార్ కార్డ్ నెంబర్‌ను ఎంటర్ చేసి బ్యాంక్ వివరాలను పొందుపరిచిన తర్వాత స్కానింగ్ కోరుతుంది. ఆ తర్వాత వినియోగదారుడు తన వేలి ముద్రను బయోమెట్రిక్ రీడర్ పై ఉంచితే లావాదేవీ పూర్తవుతుంది. ఇప్పటికే ఈ యాప్‌కు అవసరమైన బయోమెట్రిక్ రీడర్లు మార్కెట్ లో ఉన్నాయి. వీటి ధర రూ.2000గా ఉంది.