రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌పై రాజ్యసభలో విపక్షాల ధ్వజం | opposition fired on congress in rajya sabha over telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌పై రాజ్యసభలో విపక్షాల ధ్వజం

Published Tue, Aug 13 2013 2:54 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM

opposition fired on congress in rajya sabha over telangana

రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని సోమవారం రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్ర  పదజాలంతో ఉతికి ఆరేశాయి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉంటూ కూడా తొమ్మిదేళ్ల పాటు ఉద్దేశపూర్వకంగా నానబెట్టి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా తెలంగాణ నిర్ణయాన్ని ప్రకటించడం వెనక రాజకీయంగా లబ్ధి పొందాలన్న దుర్భుద్ధి దాగుందంటూ దుయ్యబట్టాయి. కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవకాశవాదానికి ఈ నిర్ణయం పరాకాష్ట అంటూ మండిపడ్డాయి. విభజనతో తలెత్తే కీలకమైన సమస్యలపై ఎలాంటి సంప్రదింపులు, చర్చలూ లేకుండా ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ అపహాస్యం పాలు చేస్తోందంటూ పలు పార్టీల నేతలు తూర్పారబట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించి సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేయాలని సూచించారు. కాంగ్రెస్ నిర్ణయంతో రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాలు అగ్నిగుండంలా మారాయన్నారు. ఇంకా నిప్పుతో చెలగాటమాడకుండా అన్ని కీలక సమస్యలపై సంప్రదిపుల కోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్ వేసిన ఆంటోనీ కమిటీకి బదులుగా ప్రభుత్వమే అన్ని పార్టీల ప్రతినిధులతో, నిపుణులతో అధికారిక కమిటీని ఏర్పాటు చేసి అన్ని అంశాలనూ కూలంకషంగా చర్చించాలని డిమాండ్ చేశాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై ఆగస్టు 5న కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన ప్రకటన ప్రాతిపదికగా సోమవారం రాజ్యసభలో దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా, వాడి వేడిగా చర్చ జరిగింది. తెలంగాణ నిర్ణయానికి నిరసనగా సభా కార్యక్రమాలకు వారం రోజులుగా అడ్డుపడుతున్న టీడీపీ ఎంపీ యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) చర్చను ప్రారంభించారు. బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు, సీపీఎం పార్లమెంటరీ పార్టీ నాయకుడు సీతారాం ఏచూరిలతో పాటు కనిమొళి (డీఎంకే), మైత్రేయన్ (అన్నాడీఎంకే), సుఖేంద్ర శేఖర్ రాయ్ (తృణమూల్ కాంగ్రెస్), నరేశ్ అగర్వాల్ (సమాజవాదీ), బీరేంద్ర ప్రసాద్ బైస్య (అస్సాం గణపరిషత్), బిశ్వజిత్ దైమారీ (బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్), వీర్ సింగ్ (బీఎస్పీ), బైష్ణవ్ పరీడా (బిజూ జనతాదళ్), ప్రొఫెసర్ బరున్ ముఖర్జీ (ఫార్వర్డ్ బ్లాక్), రాష్ట్రానికి చెందిన సి.ఎం.రమేశ్, నందమూరి హరికష్ణ (టీడీపీ), కె.వి.పి.రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడి, రాపొలు ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి (కాంగ్రెస్)తదితరులు పాల్గొన్నారు.
 
రాజకీయ అవకాశవాదమే: ఏచూరి
 భాషాప్రయుక్త రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దని ఏచూరి అన్నారు. కాంగ్రెస్ నిర్ణయం పచ్చి రాజకీయ అవకాశవాదం తప్ప మరోటి కాదంటూ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లేకపోతే కేంద్రంలో గత యూపీఏ ప్రభుత్వాలు ఏర్పడేవే కావని గుర్తు చేశారు. ఇప్పుడక్కడ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందనే భయంతోనే, ఆ నష్టాలను పూడ్చుకొనే దురుద్దేశంతోనే ప్రజల జీవితాలతో పాలక పార్టీ చెలగాటమాడుతోందంటూ నిప్పులు చెరిగారు. ‘‘రాష్ట్రంలో 44 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతమవుతోంది. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు స్వాతంత్య్ర పోరాటంలో అంతర్భాగం. ఎన్నో పోరాటాలు, ఎంతోమంది త్యాగాల ఫలితంగా, పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో తెలుగు ప్రజల  సమైక్య రాష్ట్రం ఏర్పడింది. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కోరుతూ 1928లోనే మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన కాంగ్రెస్ తీర్మానించింది. అందుకే స్వాతంత్య్రానంతరం రాష్ట్రాల పునర్విభజన జరిగింది. వాటిని కదిలించడం తేనెటీగల తుట్టెను కదిలించడమే. కచ్చితంగా ఇప్పుడు అదే జరుగుతోంది. తెలంగాణ సమస్య పరిష్కారానికి 40 ఏళ్ల క్రితమే రాజ్యాంగాన్ని సవరింంచి 371(డి) అధికరణాన్ని పొందుపరిచినా ఇంతకాలంగా సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారో చూడాలి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పుట్టి, తెలంగాణలో చదివిన నేను, 1969 ఉద్యమంతో విద్యా సంవత్సరాన్ని కోల్పోయి ఢిల్లీకి వలస రావాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తినే పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరం. విభజనతో ముడివడి ఉన్న అనేక వివాదాస్పద అంశాలు పరిష్కారం కాకుండా, ఎన్నికల ప్రకటన వెలువడితే ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందనే భయంతోనే హడావుడిగా నిర్ణయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రితో సహా పెద్దసంఖ్యలో కాంగ్రెస్ నేతలే వ్యతిరేకిస్తున్న తెలంగాణ నిర్ణయంతో ముందుకెళ్తే రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లోనూ ఎదురు దెబ్బలు తప్పవనే వాస్తవాన్ని కాంగ్రెస్ గుర్తించాలి’’ అని హితవు చెప్పారు. వివాదాస్పద అంశాలను అఖిలపక్షం ముందు పెట్టాలని డిమాండ్ చేశారు.
 
అస్సాంను కాపాడండి: బైస్య
 
తెలంగాణ నిర్ణయంతో అస్సాం అగ్నిగోళంలా మారిందని ఏజీపీ నేత బీరేంద్ర స్రసాద్ ైబె స్య వాపోయారు. ‘‘ఇంతకాలం ఎంతో ప్రశాంతంగా ఉన్న అస్సాంలో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు కేంద్రం తక్ష ణమే ఏదో ఒకటి చేయాలి. అస్సాంలో పక్షం రోజులుగా కనీసం రెండు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఊపందుకున్నాయి. హింసతో రాష్ట్రం అట్టుడుకుతోంది. కాంగ్రెస్ తీసుకున్న తెలంగాణ నిర్ణయమే ఈ పరిస్థితికి కారణం’’ అంటూ ఆక్షేపించారు. తెలంగాణ ఇస్తే బోడోలాండ్ ఎందుకివ్వరని బీపీఎఫ్ సభ్యుడు బిశ్వజిత్ దైమారీ ప్రశ్నించారు. తెలంగాణ నిర్ణయాన్ని అన్నాడీఎంకే, డీఎంకే, ఎస్పీ సభ్యులు పూర్తిగా వ్యతిరేకించారు. జేడీ (యు) నేత శివానంద తివారీ మాత్రం తెలంగాణకు మద్దతు పలుకుతూనే, రెండో ఎస్సార్సీ అవసరమని, హైద్రాబాద్ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలని సూచించారు.  తెలంగాణ  సెంటిమెంట్‌ను విస్మరించలేమన్న ఫార్వర్డ్ బ్లాక్ సభ్యుడు బరూన్ ముఖర్జీ, రాజకీయ కారణాలతో రాష్ట్రాలను విభజించరాదని, రెండో ఎస్సార్సీ వేయాలని సూచించారు.
 
ఎక్కడో పుట్టి ఇక్కడ రాజకీయాలా? సోనియాపై సీఎం రమేశ్ ధ్వజం... సభలో రభస
 
 ఎక్కడో పుట్టిన విదేశీయురాలు మన దేశ రాజకీయాలను శాసిస్తూ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలే రాష్ట్రంలో ప్రస్తుత ఆందోళనలు, అలజడికి కారణమని సి.ఎం.రమేశ్ చేసిన వ్యాఖ్యతో రాజ్యసభలో కాసేపు తీవ్ర గందరగోళం తలెత్తింది. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టింది కాంగ్రెసేనని, సీమాంధ్ర ప్రజానీకం ఆగ్రహంతో రగిలిపోతుండడానికి ఒక విదేశీ వనిత నిర్ణయమే కారణమని ఆయన ఆరోపించారు.దాంతో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు ఆయనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రి జె.డి.శీలం, రేణుకా చౌదరి, ఎంపీలు ఆనందభాస్కర్, పాల్వాయిలతో పాటు కేవీపీ కూడా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై తామిచ్చిన లేఖను ఉపసంహరించుకోలేదని అనంతరం రమేశ్ చెప్పారు. ఎవరినీ సంప్రదించకుండా అడ్డగోలుగా నిర్ణయం తీసుకున్న తీరునే తప్పుబడుతున్నామంటూ వివరణ ఇచ్చారు. టీడీపీని దెబ్బ తీసేందుకే విభజన ఎత్తుగడ వేశారన్నారు.
 
 తెలంగాణకు సుముఖం: బీఎస్పీ ఎంపీ వీర్‌సింగ్
 ‘‘తెలంగాణ ఏర్పాటును మా పార్టీ స్వాగతిస్తోంది. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మా పార్టీ సుముఖంగా ఉంది. చిన్న రాష్ట్రాల ద్వారా పాలనా సౌలభ్యం పెరుగుతుంది. ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. అయితే ప్రస్తుతం తలెత్తిన సమస్యలను, ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.’’
 
 ఈ పరిస్థితులకు కాంగ్రెసే కారణం: డి.రాజా (సీపీఐ)
 ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు కాంగ్రెస్ పార్టీయే కారణం. తెలంగాణపై తన నిర్ణయాన్ని వెల్లడించడంలో ఆ పార్టీ తీవ్ర జాప్యం చేసింది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రతినిధులతో చర్చించాక సుదీర్ఘ కాలం తర్వాత తన నిర్ణయాన్ని చెప్పింది. అందువల్ల ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఆ పార్టీయే బాధ్యత వహించాలి. తెలంగాణ విషయంలో మేం ఎన్నో ఆలోచనలు చేశాం. ప్యాకేజీ ఇస్తే ఎలా ఉంటుంది.. ప్రత్యేక హోదా ఇస్తే ఎలా ఉంటుందన్న అంశాలపై పార్టీ పరంగా కసరత్తు చేశాం. అయితే తెలంగాణ ఏర్పాటే సమస్యకు పరిష్కారమన్న నిర్ణయానికి వచ్చాం. ఈ విభజన అన్నది అన్నదమ్ముల మధ్య మాదిరి సామరస్య పూర్వకంగా జరగాలని చెప్పాం. కానీ ఇప్పుడు ఇరుప్రాంతాల మధ్య విద్వేషాలు చెలరేగుతున్నాయి. దీనికి పూర్తిగా కాంగ్రెసే కారణమని మా పార్టీ భావిస్తోంది’’
 
 విభజన సులభం కాదు: కనిమొళి
 ‘‘రాష్ట్ర విభజన చాలా బాధతో కూడుకున్నదని ప్రస్తుత చర్చ స్పష్టం చేస్తోంది. విభజన అంత సులభం కాదు. అలాగే ఇది ప్రజల భావోద్వేగాలు, ఆందోళనలు, భయాలు, రోజువారీ జీవితాలతో ముడి పడి ఉన్న అంశం. ఇక్కడ చాలా ఓపికతో, అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉంది. ఏడాదిలోపే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ విభజన ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందని మా పార్టీ నాయకుడు కరుణానిధి ప్రశ్నిస్తున్నారు. ఏడాదిలోపు రాష్ట్ర విభజన ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయగలిగే అవకాశం ఉందా? అందరి ఆందోళనలను, సందేహాలను, భయాలను నివత్తి చేసే అవకాశం ఉంటుందా? ఏది జరిగినా సామరస్యపూర్వకంగానే జరగాలి. కానీ కొంత మంది నాయకులు బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేస్తూ.. తెలంగాణలో వేరే ప్రాంతం వాళ్లు ఉండడానికి వీలులేదు.. ఉద్యోగాలు చేయడానికి వీలు లేదు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఇతర ప్రాంత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు భయాందోళనలకు గురవుతున్నారు. వాటన్నింటినీ పరిష్కరించాకే ప్రభుత్వం ముందుకువెళ్లాలి’’
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement