బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో 16 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణకేంద్రం హెచ్చరించింది. చెన్నైలో మోస్తరుగా వర్షం పడవచ్చు. ఈ వర్షాలకు అధికార వర్గాలను అప్రమత్తం చేస్తూ ఆరంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక కొద్ది రోజులుగా జ్వరాలు మరింత స్వైరవిహారం చేస్తుండడంతో ఆస్పత్రుల్లో ఐదు వేల మంది చికిత్స పొందుతున్నారు. డెంగీ బారినపడ్డ వారిలో ఆదివారం నలుగురు పిల్లలు మరణించారు.
సాక్షి, చెన్నై: ముందుగానే రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన విషయం తెలి సిందే. ఈ ప్రభావంతో నాలుగు రోజులుగా అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతూ వస్తున్నాయి. ఇప్పటికే అనేక జలాశయాల్లోకి నీటి రాక పెరిగింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.ఈ పరిస్థితుల్లో బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి బయలు దేరడంతో పాటుగా, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో ఆరంజ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఇప్పటికే ముందు జాగ్రత్తలతో సర్వం సిద్ధం చేసి ఉన్న అధికార వర్గాలు, ఈ అలర్ట్‌తో మరింత అప్రమత్తమయ్యారు.
నాలుగు రోజులు వర్షం..
దీపావళికి ముందుగా వర్షం పడడం సహజం. అయితే, ఈ సారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణకేంద్రం ప్రకటించింది. శ్రీలంకకు సమీపంలో బంగాళా ఖాతంలో అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రభావం ఈశాన్య రుతు పవనాలు, అరేబియా సముద్రంలో వీస్తున్న సుడిగాలుల రూపంలో తమిళనాడులోని 16 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఆదివారం ప్రకటించింది. తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, రామనాథపురం, శివగంగై, పుదుకోట్టై, అరియలూరు, పెరంబలూరు, నీలగిరి, కోయంబత్తూరు, తేని, దిండుగల్, మదురై, తిరునల్వేలి, కన్యాకుమారి, కడలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువేనని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో అధికార వర్గాలు అప్రమత్తంగా వ్యవహరించే పనిలోపడ్డాయి. చెన్నైలో ఆకాశం మేఘావృతంగా ఉంటుందని, కొన్ని చోట్ల మోస్తరుగా వర్షం తెరపించి తెరపించి పడుతుందని, రాత్రుల్లో మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకావం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో కన్యాకుమారి జిల్లా దేవాలంలో 13 సె.మీ, శివలోకంలో 12 సె.మీ, వేడచందూరు, కుమార పాళయం, సత్యమంగళం, మేట్టుపాళయంలో ఏడు నుంచి తొమ్మిది సె.మీ మేరకు వర్షం పడింది. ఈ శాన్య రుతు పవనాల రాకతో ఇప్పటి వరకు అత్యధికంగా కన్యాకుమారి, తిరునల్వేలి, నీలగిరి జిల్లాల్లో వర్షం పడింది. ఇక్కడి జలపాతాలు, వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో పాటు జలాశయాలు శరవేగంగా నిండుతున్నాయి.
జ్వరాల స్వైరవిహారం..
వర్షాలకు తోడుగా సీజన్ జ్వరాలు కొద్ది రోజులుగా రాష్ట్రంలో స్వైరవిహారం చేస్తున్న విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా వర్షాలు పడుతున్న జిల్లాల్లో ప్రస్తుతం ఈ జ్వరాల తీవ్రత పెరిగింది. తిరుచ్చి, తిరువారూర్, తంజావూరు, నాగపట్నం, కరూర్, అరియలూరు, పెరంబలూరు, తేని, చెన్నై జిల్లాల్లో జ్వరాలతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగి ఉన్నది. ఆదివారం ఒక్క రోజు ఐదువేల మంది చికిత్స నిమిత్తం ఆస్పత్రుల్లో చేరారు. ఇక, డెంగీ నిర్ధారణ కావడంతో చెన్నై చిన్న పిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన పుళల్‌కు చెందిన గుణశేఖరన్ పెద్దకుమారుడు అరవింద్ మరణించాడు. ఆయన చిన్న కుమారుడు అరుణాచలంకు సైతం డెంగీ నిర్ధారణతో చికిత్సలు అందిస్తున్నారు. అలాగే, పెరియమేడుకు చెందిన ఆనంద్ కుమార్తె అక్షర సైతం చికిత్స పొందుతూ మృతి చెందింది. కరూర్‌లో వైష్ణవి అనే నాలుగో తరగతి విద్యార్థినితో పాటుమరొకరు డెంగీతో బాధ పడుతూ తిరుచ్చి ఆస్పత్రిలో మృతిచెందారు. మృతుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో భయాందోళన మొదలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment