
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని పోలీసుశాఖలో పోస్ట్‌మ్యాన్ తరహా విధులు నిర్వహించడానికి జారీ చేసిన 62 పోస్టులకు ఏకంగా 93,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. పోలీసు టెలికం విభాగం పంపే సందేశాలను ఒక ఆఫీసు నుంచి మరో ఆఫీసుకు అందించే మెసెంజెర్ (పోస్టుమ్యాన్) ఉద్యోగాలకు రాష్ట్రసర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది. కనీస విద్యార్హత ఐదో తరగతి. పీహెచ్‌డీ చేసిన 3,700 మంది ఈ పోస్టుకు దరఖాస్తుచేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 28,000 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 50 వేల మంది గ్రాడ్యుయేట్లున్నారు. ఇక 5 నుంచి 12వ తరగతి వరకు విద్యార్హత ఉన్నవారు 7,400 మంది ఉన్నారు. నెలజీతం రూ.20 వేలు. ఎక్కువ దరఖాస్తులు రావడంతో రాత పరీక్ష నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు.