సరిహద్దులో హసన్ అలీ చేష్టలు
న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్‌ల మధ్య అట్టారి–వాఘా సరిహద్దులో నిర్వహించే జెండా అవనత కార్యక్రమం ‘బీటింగ్ రిట్రీట్’ సందర్భంగా పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ అత్యుత్సాహం ప్రదర్శించాడు. శనివారం బీటింగ్ రిట్రీట్ జరుగుతుండగా గ్యాలరీ నుంచి పాక్ రేంజర్లు కవాతు చేస్తున్న చోటుకు దూసుకొచ్చిన అలీ.. భారత అభిమానుల వైపు తిరిగి తొడలు చరుస్తూ, రెండు చేతులు గాల్లోకి లేపి వికెట్లు తీసినట్లు సంబరాలు చేసుకున్నాడు. అనంతరం మరో వ్యక్తి అతడిని వెనక్కు తీసుకెళ్లాడు.
దీంతో ఈ ఘటనపై సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయమై బీఎస్‌ఎఫ్ ఐజీ(పంజాబ్ ఫ్రాంటియర్) ముకుల్ గోయల్ మాట్లాడుతూ..‘ అలీ చర్య బీటింగ్ రిట్రీట్‌కున్న గౌరవాన్ని దెబ్బతీసింది. ఇరుదేశాల పౌరులు గ్యాలరీలో కూర్చొని ఎలాంటి సంజ్ఞలనైనా చేయొచ్చు. కానీ కవాతు మధ్యలోకి ఇలా రావడానికి వీల్లేదు. ఈ ఘటనపై పాకిస్తాన్ రేంజర్లకు మా నిరసన తెలియజేస్తాం’ అని వెల్లడించారు. అలీ వీడియోను పాక్ క్రికెట్ బోర్డు ట్వీటర్‌లో పోస్ట్ చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment