మోదీ పర్యటనతో పాక్ వెన్నులో వణుకు
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనను చూసి పాకిస్తాన్ వణికిపోతోంది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా రెండు దేశాల అధినేతలు పెద్ద కుట్ర పన్నుతున్నట్లున్నారంటూ పాక్ రక్షణ శాఖ విశ్లేషకులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘పాకిస్తాన్‌లో అశాంతి సృష్టించేందుకు భారత్, ఇజ్రాయెల్ దేశాలు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు మోదీ స్వయంగా ఇజ్రాయెల్‌లో పర్యటించడం, రక్షణ ఒప్పందాలు చేసుకోవడం నిజంగా పాకిస్తాన్‌కు ఆందోళన కలిగించే అంశమే’ పాక్ విదేశాంగ శాఖకు చెందిన అధికారి ఒకరు మీడియా ముందు వ్యాఖ్యానించారు.
‘భారత్, ఇజ్రాయెల్ దేశాలు కలసి కచ్చితంగా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా కుట్రపన్నుతుంటాయి’ అని పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ప్రత్యేక సలహాదారు ఆసిఫ్ కిర్మాణి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భారత్, ఇజ్రాయెల్ దేశాలు రూ.10,400 కోట్ల విలువైన రక్షణ ఒప్పందం చేసుకోవడం పట్ల పాకిస్తాన్ ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇంతవరకు ఏ భారత ప్రధాన మంత్రి ఇజ్రాయెల్‌లో పర్యటించనప్పుడు మోదీ పర్యటించడం వెనక కచ్చితంగా మతలబు ఉంటుందని పాక్ ఆందోళన చెందుతుంది.
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇంతకాలం పాలస్తీనాకు భారత్ మద్దతు ఇస్తూ రావడం వల్ల భారత ప్రధానులెవరూ ఆ దేశంలో పర్యటించలేదు. భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు పాలస్తీనా సమస్యను దాదాపు మరచిపోయాయి. అందుకనే మోదీ ప్రస్తుత ఇజ్రాయెల్ పర్యటన పట్ల కూడా ప్రపంచ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేయలేదు.