వాని అమరవీరుడు
పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్ వ్యాఖ్య
- జూలై 19న బ్లాక్ డేగా ప్రకటన
- మండిపడ్డ భారత్
ఇస్లామాబాద్/శ్రీనగర్ : హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వాని అమర వీరుడని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. కశ్మీరీలకు సంఘీభావంగా ఈ నెల 19న బ్లాక్ డేగా పాటించనున్నట్లు ప్రకటించారు. కశ్మీర్‌లో పరిస్థితిపై చ ర్చించేందుకు శుక్రవారం లాహోర్‌లో ఆయన ప్రత్యేకంగా కేబినెట్ భేటీ నిర్వహించారు. కశ్మీరీల పోరాటాన్ని స్వాతంత్య్రోద్యమంగా అభివర్ణించారు. కశ్మీరీలకు పాక్ నైతిక, రాజకీయ, దౌత్య మద్దతు కొనసాగుతుందని, కశ్మీర్ అంశానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం కల్పించేలా చూడాలని వివిధ విభాగాలను ఆదేశించారు. కాగా, జూలై 19ని బ్లాక్ డేగా పాక్ ప్రకటించడంపై భారత్ తీవ్ర అసంతృప్తి తెలిపింది. భారత అంతర్గత వ్యవహారాల్లో ఇక నుంచి జోక్యం చేసుకోకుండా పాక్ దూరంగా ఉండాలంది. ఉగ్రవాదానికి మద్దతు పలకడం ద్వారా కశ్మీర్‌లో పరిస్థితిని అస్థిరపరిచేందుకు పాక్ యత్నిస్తోందని భవిదేశాంగప్రతినిధి వికాస్ స్వరూప్ విమర్శించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదుల్ని పొగడడం పాక్ కొనసాగిస్తోందంటూ తప్పుపట్టారు.
38కి చేరిన మృతులు..
కశ్మీర్ లోయలో శుక్రవారం మరోసారి కర్ఫ్యూ విధించారు. ప్రార్థనల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పది జిల్లాల్లో భారీగా పోలీసు, పారా మిలటరీ బలగాల్ని మోహరించారు. పుకార్లు వ్యాపించకుండా లోయలో శుక్రవారమూ మొబైల్ సేవల్ని నిలిపివేశారు. కుప్వారా జిల్లాలోని డ్రగ్‌ముల్లాలో అల్లరి మూకలు దాడి చేయడంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ముగ్గురు పౌరులు గాయపడగా, వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. కుల్గాం జిల్లా యారిపురాలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కశ్మీర్ అల్లర్లలో మృతుల సంఖ్య 38కి చేరింది. బారాముల్లా జిల్లా డెలినాలో ఒక గుంపు రాళ్లతో దాడి చేయడంతో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గు రు పౌరులు గాయపడ్డారు. కుల్గాం జిల్లా యారిపురా పోలీసుస్టేషన్‌పై దుండగులు గ్రనేడ్‌తో దాడి చేయడంతో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. శుక్రవారం ఘర్షణల్లో మొత్తం 23 మంది గాయపడ్డారు కశ్మీర్ ఆందోళనల నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర రెండో రోజూ నిలిచిపోయింది. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో శుక్రవారమూ నిలిపేశారు.
పాక్ చర్యలు చేపట్టాలి: అమెరికా
కశ్మీర్‌లో మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తోందంటూ అమెరికా విదేశాంగ ప్రతినిధి ఎలిజబెత్ ట్రూడ్యూ పేర్కొన్నారు. పాక్ భూభాగంపై కార్యకలాపాలు నిర్వహిస్తోన్న అన్ని ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కశ్మీర్‌లో సాగుతున్న అక్రమ హత్యలపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో స్వతంత్ర, పారదర్శక విచారణ నిర్వహించాలని పాకిస్తాన్ డిమాండ్ చేసింది.
డ్రమ్ములతో మోదీ కాలక్షేపం: దిగ్విజయ్
కశ్మీర్ ఒక పక్క తగలబడుతుంటే ప్రధాని మోదీ నీరో చక్రవర్తిలా టాంజానియాలో డ్రమ్‌లు వాయించడంలో తలమునకలయ్యారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. రెండేళ్లుగా కశ్మీర్‌లో పరిస్థితి దిగజారుతున్నా గట్టి చర్యలు తీసుకోలేదన్నారు.