రష్యా వేదికగా భారత్, పాక్ ప్రధానుల భేటీ
మాస్కో: భారత్, పాకిస్థాన్ ప్రధానమంత్రులు మరోసారి భేటీ అయ్యారు. రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారమిక్కడ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్తో సమావేశం అయ్యారు. ఇరు ప్రధానుల భేటీతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఉగ్రవాదం, కశ్మీర్ సమస్యపై ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
ప్రధానంగా పాకిస్తాన్ జైలునుండి విడుదలైన జకీ వుర్ రెహ్మాన్ అంశం తదితర అంశాలపై ప్రధాని మోదీ తమ వైఖరిని వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో గతరాత్రి భోజన సమయంలో ఇద్దరు ఫార్మల్గా కలుసుకున్నారు. యుద్ధం వస్తే అణ్వాయుధాలో సిద్ధంగా ఉన్నామన్న పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు, దానికి భారతరక్షణమంత్రి కౌంటర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరోవైపుపాక్,భారత ప్రధానుల భేటీపై అమెరికా సంతోషం వ్యక్తం చేసింది. పరస్పర చర్చల ద్వారానే ఇరు దేశాల మధ్యనున్న సమస్యలు తొలగిపోతాయని పేర్కొంది. గత నెల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా షరీఫ్‌కు మోదీ ఫోన్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య శాంతియుత ద్వైపాక్షిక సంబంధాల అవసరాన్ని గురించి మోదీ నొక్కి చెప్పారు. షరీఫ్‌కు మోదీ ఫోన్ చేయడాన్ని పాకిస్తాన్‌కు దగ్గర కావాలన్న భారత్ ఆకాంక్షను ప్రతిబింబిస్తోందని పరిశీలకుల భావన. మయన్మార్‌లో భారత్ సైనిక చర్య తరువాత బంగ్లాదేశ్ పర్యటనలో మోదీ పాకిస్తాన్‌ను నిశితంగా విమర్శించారు. దీని తరువాత మోదీ, షరీఫ్ ల పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు.
పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయపాక్ అధికారి మాట్లాడుతూ, భారత్‌తో సహా పొరుగుదేశాల న్నింటితో సామరస్య, సహకారయుత సంబంధాలను కొనసాగించాలన్నది షరీఫ్ విధానమన్నారు. ఈ లక్ష్యంతోనే తమ నేత భారత ప్రధానిని కలుసుకోబోతున్నారని, పరస్పర ఆసక్తి కలిగిన అన్ని అంశాలపైన పరస్పర అంగీకారం కావాలని ఆయన చెప్పారు.