కశ్మీరీల పోరాటం, ఉగ్రవాదం ఒక్కటి కాదు
పాకిస్తాన్ ప్రధాని షరీఫ్
ఇస్లామాబాద్: కశ్మీరీల పోరాటాన్ని భారత్ ఉగ్రవాదంతో పోల్చడం సరైనది కాదని పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ అన్నారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పోరాటం చేస్తున్న కశ్మీరీలను, ఉగ్రవాదులతో సరిపోల్చితే అది భారతదేశ పొరపాటని వ్యాఖ్యానించారు. భారత దళాల ఎన్‌కౌంటర్లో చనిపోయిన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్‌వనీ కశ్మీర్‌కు గర్వకారణమనీ, స్వాతంత్య్రం కోసం పోరాడాడని అన్నారు. సోమవారం జరిగిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) కేంద్ర కార్యనిర్వాహక వర్గం సమావేశంలో షరీఫ్ ప్రసంగించారు. కశ్మీరీల పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందనీ, దీన్ని ప్రపంచంలోని ఏ శక్తీ ఆపలేదని పేర్కొన్నారు.
పత్రికపై పాక్ ప్రధాని కొరడా
పాకిస్తాన్ మిలిటరీ, ఐఎస్‌ఐ గురించి కథనం రాసిన పాక్ పత్రిక ‘డాన్’పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని షరీఫ్ ఆదేశించారు. ఈనెల 6న ప్రచురించిన కథనం జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని షరీఫ్ అన్నారు.