ప్రతీకాత్మక చిత్రం
ఎన్నికలలో గెలవడమే లక్ష్యం తప్ప భారత, కశ్మీర్ ప్రజల శాంతియుత, పురోగామి భవితవ్యం లెక్కలోలేని మోదీ షాల నిరంకుశ విధానం గమనిస్తే రానున్న సాధారణ ఎన్నికలకు ముందు సైనిక పరిష్కారం పేరుతో కశ్మీర్‌లో యుద్ధ వాతావరణం ఏర్పడినా ఆశ్చర్యం లేదు. వారికి కావలసింది ఏకశిలా సదృశమైన హిందూ రాజ్యం. ఈ విషయంలో నేటి పాలకులకు పాకిస్తాన్ ఆదర్శం. వాస్తవానికి ఈ ఇస్లాం, హిందూ మతతత్వాలు మతం పేరుతో మారణహోమం జరిపేందుకు పరస్పరం సహకరించుకుంటున్నాయి. కనుక భారత ప్రజలు ఈ మతతత్వ కుట్రలు సాగకుండా అప్రమత్తంగా ఉండాలి.
ఇటీవలి కశ్మీర్ పరిణామాలు శాంతి కాముకులైన ప్రతి భారతీయుణ్ణి కలవరపెడుతున్నాయి! అక్కడ పీడీపీ ప్రభుత్వానికి ఆ సంకీర్ణ పాలనలో భాగస్వామిగా ఉండిన మోదీ, షా ల బీజేపీ మద్దతు ఉపసంహరించడం, ఆ రాష్ట్రంలో గవర్నర్ పాలన ఏర్పడటం వంటి ప్రమాదకరమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిజానికి ఆ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో పీడీపీ పదవీ వ్యామోహం.. మోదీ, షాల సార«థ్యంలో బీజేపీ అవకాశవాద, రాజకీయ దుర్నీతి మాత్రమే కాకుండా, వారి మతతత్వ సైద్ధాంతికత, వారి జాతీయత మాటున జాతీయ దురహంకారాలు కూడా దాగి ఉన్నాయి. ఈ అవధులు లేని జాతీయ దురహంకారమే ఫాసిస్ట్ హిట్లర్‌ని సృష్టించింది. ఇక కశ్మీర్‌లో రానున్న నిరంకుశ పాలన వలన, ఆ ప్రజానీకం ఎదుర్కోనున్న లాఠీ తూటా పాలన కొనసాగింపును తలుచుకుంటే, కానవస్తున్న మధ్యయుగాల నాటి అంధకారం ఆందోళన కలిగిస్తున్నది.
పీడీపీ వలెనే అస్సాంలో, ఈశాన్య రాష్ట్రాల్లో, గోవాలో బీజేపీ సంకీర్ణం మాటున దొడ్డిదోవన అధికారం చేపట్టిన రాష్ట్రాలన్నింటికీ ఈ కశ్మీర్ పరిణామ క్రమమే జరగదని చెప్పలేం. కాంగ్రెస్ ముక్త భారత్ అనే ప్రకటిత బీజేపీ నినాద అసలు రూపం... గిరిజన ఆదివాసీలు, అన్యమతాలైన ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధ తదితర మతాలు, పురోగామి, ప్రజాస్వామ్య లౌకిక, దృక్పథాలన్నింటి ముక్త భారత్ అని క్రమేపీ బయటపడుతోంది. చిన్న, చిన్న రాష్ట్రాలను ముందుగా కబళించి, వాటిని పేరుకే ఆయా రాష్ట్రాల పాలనగా మార్చి, తన కండలను పెంచుకోవాలని బీజేపీ చూడటంలో ఆశ్చర్యం లేదు. అయితే కశ్మీర్‌లో పీడీపీకి ఏదో మేరకు.. బీజేపీతో అంటకాగిన అనుభవం కళ్లు తెరిపించినట్లు, ఈ చిన్న చిన్న రాష్ట్రాలు సైతం కళ్లు తెరిచి నిజమైన వెలుగును చూస్తాయి. ఇక పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి ప్రభుత్వాలు బీజేపీ లిస్టులో చేరినా ఆ ప్రజానీకం ఆశించిన దానికంటే త్వరగానే మేల్కొని, బీజేపీ అవకాశవాద, సంకుచిత, మతతత్వ రాజకీయాలను ఎదుర్కోగలవన్న సూచనలు కనిపిస్తున్నాయి.
గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు, అంతకుమించి జరిగిన 10 శాసనసభా స్థానాలు, నాలుగు పార్లమెంటు స్థానాల ఉపఎన్నికలు అన్నింటిలో బీజేపీ పొందిన ఘోరపరాజయం ఆశాజనకంగా ఉంది. ఇక బీజేపీ పాలనలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లు ఈసారి బీజేపీ ముక్త రాష్ట్రాలు కానున్నాయి. కానీ, కొంత ఆశాజనకంగా ఉన్న ఈ పరిస్థితిని చూసి, కశ్మీర్ నేటి పరిస్థితిని ఉపేక్షించడం కానీ, అది ఎదుర్కొంటున్న, ఎదుర్కోనున్న తీవ్ర వాతావరణాన్ని కానీ మర్చిపోరాదు. జమ్మూ ప్రాంతంలో హిందువులు అధికం. కశ్మీర్ ప్రాంతంలో ముస్లింలు అధికం. నేటి జమ్మూ కశ్మీర్‌లో మొత్తంగా పాలనా పరిస్థితి ముస్లిం మతానుయాయులకు, వారిని ప్రేరేపిస్తున్న ఆ మతతత్వవాదులకు వ్యతిరేకంగా ఉంటున్నట్లు పైకి కనబడుతున్నప్పటికీ, ఆ విభజనకు అతీతంగా కశ్మీర్ ప్రజలు వారి ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధి మరుగున పడిపోతున్నాయి. ఇదే ప్రమాదకరమైన అంశం.
నేటి కశ్మీరులో ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఆనాటి కశ్మీర్ రాజ్యం, దాని ప్రత్యేకతపై వివాదం రాజకీయంగా, భౌగోళికంగా నేటికీ సజీ వంగా ఉండటమే. పాకిస్తాన్ అధీనంలోకి దాదాపు సగం కశ్మీర్ వెళ్లిపోయిన నేపథ్యంలో మిగిలిన కశ్మీర్ భాగాన్ని కశ్మీర్ ప్రభువు కోరిక మేరకు కొన్ని షరతులతో అంటే కశ్మీర్‌కు ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం, భారత పార్లమెంట్ చేసిన చట్టాలు యథాతథంగా అమలుకాకుండా, కశ్మీర్ అసెంబ్లీ ఆమోదిస్తేనే అమలవడం వంటి కొన్ని షరతులతో కశ్మీర్ ప్రభువు భారతదేశంతో సంధి కుదుర్చుకుని కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశాడు. చివరకు కశ్మీర్ సమస్య ఐక్యరాజ్యసమితి వరకు వెళ్లిన నేపథ్యంలో ప్లెబిసైట్ నిర్వహించి ఆ ఓటింగ్‌లో తేలిన ప్రజాభి ప్రాయం ప్రకారం కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని ఐరాస తీర్మానం చేసింది కూడా. ఇది నేటికీ ఐరాస తీర్మానాలలో సజీ వంగా ఉంది కనుక కశ్మీర్ వ్యవహారం ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య వ్యవహారంగానో, హిందూ ముస్లిం సమస్యగానో మాత్రమే పరిగణించడం సరైనది కాదు. అప్పటి నుంచి కశ్మీర్ తీరని సమస్యగానే మిగిలిపోయింది. కశ్మీర్ ప్రజానీకం తమ జాతి అస్తిత్వ నిర్దిష్ట స్వరూపాన్ని కోల్పోయి అటు పాకిస్తాన్, ఇటు భారత్ మధ్య అగ్నిలో సమిధలవుతున్నారని భావించడంలో ఆశ్చ ర్యం లేదు.
ఈ వాస్తవాన్ని ముందుగా అంగీకరించి ఆ ప్రజానీకం భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకుని ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా పాకిస్తాన్, భారత్ పరస్పర చర్చల ద్వారా అంతర్జాతీయంగా కూడా తోడ్పాటు తీసుకుని పరిష్కరించుకోవాలి. ఎవరి భూభాగం ఎంత అన్నది కాదు అసలు ప్రశ్న. ఒక స్వతంత్ర రాజ్యంగా, జాతిగా ఉండిన ఆ దేశ ప్రజల భౌతిక వాస్తవిక జీవనం అభివృద్ధి పథాన శాంతి సౌభాగ్యాలతో సాగాల్సి ఉంది.తమ జాతి రెండు ముక్కలై అటు పాక్, ఇటు భారత్ పాలనలో మగ్గుతున్నదని, తమది స్వతంత్ర దేశం, స్వతంత్ర జాతి అన్న భావనతో తొలినుంచి కశ్మీరీలలో అసంతృప్తి మొదలై అలజడికి దారితీసింది. మరోవైపున, కశ్మీర్‌పై ఈ నాన్చుడు వ్యవహా రం ఏమిటి? కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడమే నెహ్రూ ప్రభుత్వ నేరం కాబట్టి ఆర్టికల్ 370ని రద్దు చేయాలి. శషభిషలు లేకుండా కశ్మీర్‌లో అలజడి సృష్టిస్తున్న శక్తులకు, సైనికంగా అణచివేయడమే పరిష్కారం, పాకిస్తాన్ మద్దతుతో ఉద్యమిస్తున్న తిరుగుబాటుదారులతో, ఉదారవాద ప్రజాస్వామిక శక్తులతో సంప్రదింపులు, చర్చలు జరపడం అనవసరం, సైనిక పరిష్కారమే మార్గం అనే హిందూ మతతత్వ శక్తులు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే చర్యలు బలపడటం చూస్తున్నదే. వీటన్నింటి పరాకాష్టే మొన్నటి మోదీ షాల నేతృత్వంలో గవర్నర్ పాలనకు దారితీసిన పరిస్థితి.
సరిగ్గా ఈ సైనిక పరిష్కార భావనే నేటి ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లోనూ, కశ్మీర్ లోనూ తీవ్ర విపత్కర విషాద పరిస్థితులకు దారితీస్తోంది. ఈ జ్వాలను ఆర్పేబదులు, నిరంతరం మండుతూ కశ్మీర్ ప్రజల న్యాయమైన సహేతుకమైన శాంతియుత జీవనాన్నే కాల్చి బుగ్గి చేసే ప్రమాదం ఉంది. ఎన్నికలలో గెలవడమే లక్ష్యం తప్ప భారత, కశ్మీర్ ప్రజల శాంతియుత, పురోగామి భవితవ్యం లెక్కలోలేని మోదీ షాల నిరంకుశ విధానం గమనిస్తే రానున్న సాధారణ ఎన్నికలకు ముందు సైనిక పరిష్కారం పేరుతో కశ్మీర్‌లో యుద్ధ వాతావరణం ఏర్పడినా ఆశ్చర్యం లేదు. వారికి కావలసింది ఏకశిలా సదృశమైన హిందూ రాజ్యం. ఈ విషయంలో నేటి పాలకులకు పాకిస్తాన్ ఆదర్శం. వాస్తవానికి ఈ ఇస్లాం, హిందూ మతతత్వాలు మతం పేరుతో మారణహోమం జరిపేందుకు పరస్పరం సహకరించుకుంటున్నాయి. కనుక భారత ప్రజలు ఈ మతతత్వ కుట్రలు సాగకుండా అప్రమత్తంగా ఉండాలి.
డాక్టర్ ఏపీ విఠల్
వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ 98480 69720
Comments
Please login to add a commentAdd a comment