పార్లమెంట్ శీతాకాల సమావేశాలే వేదికగా వ్యూహం
⇒ జీఎస్‌టీ, బీమా వంటి కీలక బిల్లులు అడ్డుకునే దిశగా విపక్షాలు
⇒ బీమా బిల్లుపై ప్రతిపక్షాలకు మద్దతు తెలిపిన శివసేన
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలే వేదికగా ఎన్డీఏయేతర పక్షాలు ఏకతాటిపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార పక్షానికిమూకుమ్మడిగా చెక్ పెట్టాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. సాధారణ ఎన్నికలు మొదలుకుని ఇటీవల ముగిసిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వరకూ దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనంతో మిగిలిన రాజకీయ పార్టీలన్నీ దిక్కుతోచని పరిస్థితిలోపడ్డాయి. దీంతో బీజేపీ, ఎన్డీఏయేతర పక్షాలన్నీ ఒక్కతాటిపై నిలిచి పార్లమెంట్‌లో అందివచ్చిన సందర్భాల్లో బీజేపీని ముప్పుతిప్పలు పెట్టాలని యోచిస్తున్నాయి.
మరోవైపు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న శివసేన బీమా బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలకు మద్దతు తెలపడం గమనార్హం. ఇప్పటికే రాజ్యసభలో 59, లోక్‌సభలో 8 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు బీమా చట్టం(సవరణ)బిల్లు-2008, కార్మిక చట్టం(ఫ్యాక్టరీస్‌యాక్ట్ అండ్‌అప్రెంటిస్ యాక్ట్), కోల్ మైన్స్ నేషనలైజేషన్ యాక్ట్, ఎన్‌ఆర్‌ఈజీఏ, భూసేకరణ చట్టం-2013 సవరణ.. వంటి కీలక బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టాలనుకుంటోంది. వీటిని సులభంగా పార్లమెంట్ గట్టెక్కించేందుకు ఎన్డీఏయేతర పక్షాలు సిద్ధంగా లేవు. బీజేపీ దూకుడును అడ్డుకునేందుకు రాజ్యసభను అస్త్రంగా మలుచుకోవాలని విపక్షాలు భావిస్తున్నాయి.
రాజ్యసభలో బీజేపీ బలం అంతంతే..
మొత్తం 250 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకి 43 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీ, ఎన్డీఏ సభ్యుల బలం 56 మాత్రమే. ఎన్డీఏయేతర పక్షాలన్నీ కలిస్తే వాటి బలం 128. వీటిలో కాంగ్రెస్‌కు 67 సీట్లు ఉండగా.. బీఎస్పీ(14), ఎస్పీ(10), ఐఎన్‌ఎల్‌డీ(1), జేడీ(యూ) (12), జేడీ(ఎస్)(1), టీఎంసీ(12), సీపీఐ(2), సీపీఎం(9) ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఏ బిల్లయినా విపక్షాలను కాదని నెగ్గడం ఆషామాషీ కాదు. బీమా బిల్లు ముఖ్యంగా కాంగ్రెస్ వైఖరిపై ఆధారపడి ఉంది. ఈ బిల్లు ఇప్పటికే రాజ్యసభ సెలక్ట్ కమిటీ వద్ద పరిశీలనలో ఉంది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రస్తుతం ఉన్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచాలన్నది ఈ బిల్లు ఉద్దేశం. మరో కీలకమైన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) బిల్లు రాజ్యాంగ సవరణతో కూడుకున్నందున దీనికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. దీన్ని కూడా విపక్షాలు అడ్డుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఏఐఏడీఎంకే, ఎన్సీపీ,బీజేడీలకుదగ్గరయ్యేఅవకాశాలున్నాయి.
బ్లాంక్ చెక్ ఇవ్వబోం: కాంగ్రెస్
బీమా బిల్లు, జీఎస్‌టీ బిల్లులపై ప్రభుత్వానికి బ్లాంక్ చెక్ మాదిరిగా మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ సోమవారం స్పష్టం చేసింది. జీఎస్‌టీ బిల్లు యూపీఏ హయాంలో తీసుకొచ్చిందే అని, దానికి మార్పులు చేసినట్లయితే తాము మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ స్పష్టం చేశారు. బీమా బిల్లుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. జేడీయూ, తృణమూల్ కూడా బీమా బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. బీఎస్‌పీ అధినేత్రి మాయావతి మాత్రం తాము సూచించిన సవరణలను అంగీకరిస్తే బీమా బిల్లును వ్యతిరేకించబోమన్నారు. ఎన్డీఏలో కీలక భాగస్వామి శివసేన బీజేపీకి షాక్ ఇచ్చింది. తమ సవరణలు అంగీకరించనట్లయితే బీమా బిల్లును వ్యతిరేకిస్తామని శివసేన తెలిపింది.
సజావుగా సాగేందుకు సహకరించండి: మోదీ
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఫలవంతంగా సాగుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రతిపక్షాలు తగిన సహకారం అందిస్తాయని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన సందర్భంగా పార్లమెంటు బయట ప్రధాని మోదీ విలేకరులతో మాట్లాడారు. ‘దేశ ప్రజలు మాకు ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను అప్పగించారు. అదే సమయంలో పార్లమెంటు సభ్యులందరికీ దేశాన్ని నడిపించే బాధ్యతను అప్పగించారు..’ అని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలుసజావుగా సాగడంలో ప్రతిపక్షాలు బాగా సహకరించాయని మోదీ ప్రశంసించారు. అదే తరహాలో ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.
ఏకతాటిపైకి ఎన్డీఏయేతర పక్షాలు..!
Published Tue, Nov 25 2014 1:37 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM
Advertisement
Advertisement