
బలమెంతో తేలాలంటే ఒంటరిగా పోటీ చేయండి
ఛగన్ భుజ్‌బల్ సూచన
ముంబై : ఇటు అధికార, అటు ప్రతిపక్ష కూటముల మధ్య సీట్ల పంపిణీపై ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో అన్నిరాజకీయ పార్టీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి తమ సొంత బలమెంతో తేల్చుకోవాలని ఎన్సీపీ నాయకుడు, మంత్రి ఛగన్ భుజ్‌బల్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి నెల రోజుల కన్నా తక్కువగా సమయం మిగిలి ఉన్నప్పటికీ ఇటు కాంగ్రెస్- ఎన్సీపీల మధ్య, అటు బీజేపీ- శివసేనల మధ్య సీట్ల పంపిణీపై ప్రతిష్టంభన నెలకొంది.
ఈ ప్రతిష్టంభనకు ప్రధాన కారణం కూటమిలో జూనియర్ భాగస్వాములైన బీజేపీ, ఎన్సీపీలే. ఈ రెండు పార్టీలు క్రితంసారి పోటీ చేసిన సీట్లకన్నా ఈసారి అధికంగా కోరుతున్నాయి. ఈ నాలుగు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఎన్నికలముందు పొత్తు ఖరారు కావడం లేదు గనుక, అన్నీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలని భుజబల్ సూచించారు. రాష్ట్రంలో ఎవరికి వారే తమకు బలముందని చెప్పుకుంటున్నారని, ఒంటిరిగా పోటీ చేస్తే అది ఎంతుందో తేలిపోతుందని అన్నారు. కాషాయకూటమిలోలుకలుకలు కాంగ్రెస్-ఎన్సీపీపై ఎటువంటి ప్రభావం చూపబోవని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.
రాష్ట్రంలో తమ పార్టీ కాంగ్రెస్‌కన్నా బలంగా ఉందని ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ నాలుగు సీట్లు గెలుచుకుందని అన్నారు. భుజబల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తేలికగా తీసుకుంది. తాము పొత్తును కొనసాగించాలనుకుంటున్నామని, శరద్‌పవార్‌తో చర్చలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చవాన్ చెప్పారు.