
మోదీ వర్సెస్ ‘గ్యాంగ్ ఆఫ్ ఫోర్’
ప్రధానితో తలపడుతున్న నాలుగు ‘మహా’ పార్టీలు
ముంబై: మహారాష్ట్రలో మారిన రాజకీయ సమీకరణాలు ఆసక్తికర పరిణామాలకు దారితీస్తున్నాయి. శివసేన-బీజేపీ, కాంగ్రెస్-ఎన్సీపీల ప్రధాన కూటముల పొత్తు విచ్ఛిన్నమైన నేపథ్యంలో.. ఐదు ప్రధాన పార్టీలు ఒంటరిపోరుకు దిగడం తెలిసిందే. దీంతో అవి పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటూ రాజకీయాలను రక్తి కట్టిస్తాయని పరిశీలకులు భావించారు. అయితే చిత్రం గా.. వీటిలో నాలుగు పార్టీలకు ఒకే ఒక్కరు శత్రువుగా మారారు. ఆయనే ప్రధాని నరేంద్ర మోదీ! శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, ఎమ్మెన్నెస్‌లు.. మోదీని, ఆయన పార్టీ బీజేపీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు సంధిస్తున్నాయి. ఖండనమండనల్లో ఒకదాన్నొకటి మించిపోయి కమలదళాన్ని చీల్చిచెండాడుతున్నాయి. వీటిలో ఒకదానిపై ఒకదాని విమర్శలకంటే అన్ని కలిసి మోదీపై చేస్తున్న దాడే తీవ్రంగా ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికలు ‘గ్యాంగ్ ఆఫ్ ఫోర్’ పార్టీలకు, దేశ నాయకుడైన మోదీకి మధ్య జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు రాష్ట్రానికి ‘వెలుపలి వ్యక్తుల’ని గ్యాంగ్ ఆఫ్ ఫోర్ పార్టీలు మండిపడుతున్నాయి. మహా రాష్ట్రను విభజించేందుకు, ముంబైని రాష్ట్రం నుంచి వేరుచేసేందుకు యత్నిస్తున్నారంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. మోదీ నాయకత్వంలోనే బీజేపీ తమకు వెన్నుపోటు పొడిచింద ని శివసేన విరుచుకుపడుతోంది.
విమర్శల దాడిని తట్టుకోవడానికి బీజేపీ కేవలం మోదీపైనే ఆధారపడుతోంది. సీఎం పదవికి అందరికీ ఆమోదయోగ్యమైన నేత లేకపోవడంతో రాష్ట్ర కమలనాథుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికల్లో మోదీనే తమను గట్టెక్కించే ఆపద్బాంధవుడని భావిస్తోంది. మహారాష్ట్రను విభజించే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు కుండబద్ధలు కొడుతున్నా ‘గ్యాంగ్ ఆఫ్ ఫోర్’ ప్రచారం ముందు దాని మాట గట్టిగా వినిపించడం లేదు. ఎన్నికల్లో బాగా ముందుకొచ్చే కుల, ప్రాంతీయ రాజకీయాలు ‘మోదీ వర్సెస్ గ్యాంగ్ ఆఫ్ ఫోర్’ పోరుతో వెనక్కి మళ్లడం గమనార్హం.