పౌరసత్వ బిల్లు ఆమోదంపై స్పందించిన ఆరెస్సెస్‌ | On Passage Of Citizenship Bill RSS Bhaiyyaji Joshi Says It's A Courageous Step | Sakshi
Sakshi News home page

పౌరసత్వ బిల్లు ఆమోదంపై స్పందించిన ఆరెస్సెస్‌

Published Fri, Dec 13 2019 4:24 PM | Last Updated on Fri, Dec 13 2019 4:35 PM

On Passage Of Citizenship Bill RSS Bhaiyyaji Joshi Says It's A Courageous Step - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు బుధవారం పార్లమెంట్‌లో ఆమోదం పొందడంతో రాష్ట్రీయ స్వయం సేవక్‌ (ఆరెస్సెస్‌) జనరల్‌ సెక్రటరీ భయ్యాజీ జోషి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అభినందించారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ.. బీజేపీ సారథ్యంలో కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన సాహసోపేతమైన నిర్ణయాన్ని స్వాగతించాలని కోరారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లో మతపరమైన వేధింపులు, హింసను ఎదుర్కొని భారత్‌కు వచ్చే హిందువులను చొరబాటుదారులుగా కాకుండా శరణార్థిగా గుర్తించాలని ఆరెస్సెస్‌ ఎప్పుడూ ఆకాంక్షించేదని అన్నారు. దేశ విభజన జరిగినప్పుడు.. మతపరమైన ప్రాతిపదికన విభజన జరగాలనే డిమాండ్ ఉందని, అయితే భారతదేశానికి 'మతతత్వ దేశంగా' ఏర్పాటు చేసే ఆలోచన అప్పట్లో లేదన్నారు.  కానీ, చివరకు దేశం ఈ సమస్యపైనే   విభజించబడిందని పేర్కొన్నారు.  మన నాయకులు కూడా ఈ విషయాన్ని అంగీకరించారని అన్నారు. మతపరమైన కారణాల వల్ల విభజన జరగకపోతే, ఆ తరువాత చాలా ఉదంతాలు చోటుచేసుకొనేవి కాదని ఈ సందర్భంగా ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి జోషి తెలిపారు.
 

‘మైనార్టీలకు ఎటువంటి అన్యాయం చేయబోమని పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లు ఇస్లామిక్‌ దేశాలుగా ప్రకటించుకున్నప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన జనాభా లెక్కలను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే.. అక్కడ తగ్గుతున్న మైనార్టీ జనాభాను అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యక్తులు ఎక్కడికి వలస వెళ్లారనే సందేహం తలెత్తుతుంది. అక్కడి మైనారిటీలో చాలామంది భారతదేశానికి వచ్చారు. దానికి ప్రధాన కారణం ఏమిటంటే భారత్‌లో వారికి సంపూర్ణ భద్రతతో పాటు రక్షణ’ లభించడమని అని భయ్యాజీ అన్నారు. అయితే చట్టంలోని లొసుగుల కారణంగా వారు ఏళ్ల తరబడి భారత పౌరసత్వాన్ని కోల్పోయారు. వేధింపులకు గురై వచ్చిన వారిని 'చొరబాటుదారులు' కాక శరణార్థులు అని పిలిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు.

ఇతర దేశాల నుంచి వస్తున్న మైనారిటీలకు పౌరసత్వ సవరణ బిల్లుతో భారత పౌరులుగా మారి.. దేశంలో ఆత్మ గౌరవంతో పాటు పౌర హక్కుల ప్రయోజనాలను పొందుతారని ఆనంద పడుతున్నాను. ఇక వారి శరణార్థి జీవితం ముగింపు పలకనుంది అన్నారు. ఈ బిల్లు పౌరసత్వం కల్పించేదే కానీ.. పౌరసత్వాన్ని లాక్కొనేది కాదని, ముస్లింలు ఎలాంటి భయాందోళలకు గురికావాల్సిన అవసరం లేదని ఇప్పటికే  అమిత్‌ షా స్పష్టం చేశారని అన్నారు. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ బిల్లుపై వస్తున్న వదంతుల కారణంగా అట్టుడుకుతున్నాయని.. అక్కడి ప్రజల సందేహాలను తీర్చడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ఉందని జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుతో శరణార్థులు ప్రశాంతంగా జీవిస్తారని హర్షం వ్యక్తం చేశారు. 

త్వరలో పౌరసత్వ చట్టంపై అవగాహన కార్యక్రమాలు

న్యూఢిల్లీ: వివాదస్పద పౌరసత్వ సవరణ బిల్లు చట్టాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పౌరసత్వ బిల్లుపై దేశవ్యాప్తంగా ప్రజలకు అర్థమయ్యేరీతిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనుంది. పశ్చిమ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ఈ విషయంపై వివరణ ఇస్తూ.. పౌరసత్వ సవరణ బిల్లుతో సుమారు 2 కోట్ల మంది శరణార్థులకు భారత పౌరసత్వం లభించనుందన్నారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే.. శనివారం నుంచి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి మత ఘర్షనలు, హింస కారణంగా డిసెంబరు 31, 2014కు ముందు భారత్‌కు  వచ్చిన ముస్లిమేతరులను అక్రమ చొరబాటుదారులుగా ఉన్నవారిని ఈ మేరకు భారతీయపౌరులుగా గుర్తించబడతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement