ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి
ఉత్తాన్(మహారాష్ట్ర): అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అవసరమైతే ఉద్యమ బాటపడతామని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) హెచ్చరించింది. అయోధ్య కేసు కన్నా తమకు ఇతర ప్రాధమ్యాలున్నాయన్న సుప్రీంకోర్టు ప్రకటనను హిందువులు అవమానంగా భావించారని ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మందిర నిర్మాణానికి అన్ని మార్గాలు మూసుకుపోతే ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. ఈ విషయంలో కేంద్రంపై తాము ఒత్తిడి పెంచడంలేదని, రాజ్యాంగం, చట్టాలను గౌరవిస్తామని అన్నారు. సుప్రీంకోర్టు అంటే తమకు గౌరవం ఉందని, హిందువుల సెంటిమెంట్లను కూడా కోర్టు దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు.
‘అయోద్యలో రామ మందిర నిర్మాణంపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ సాగుతోంది. అక్టోబర్ 29న జరిగిన విచారణలో హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువడుతుందని భావించారు. కానీ సుప్రీం తీర్పు అందుకు విరుద్ధంగా ఉండటంతో వారు ఆవేదన చెందుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. శబరిమల వివాదంపై స్పందిస్తూ.. మహిళల పట్ల తమకెలాంటి వివక్ష లేదని, కానీ ఆలయ నియమాలను గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శబరిమల ఆలయంలోనికి మహిళల ప్రవేశానికి తాము వ్యతిరేకమని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, రామ మందిర నిర్మాణానికి చట్టం చేయాలని కేంద్ర మంత్రి విజయ్ గోయల్ అభిప్రాయపడ్డారు.
మరి ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చు కదా..
రామ మందిరం కోసం ఉద్యమిస్తామన్న ఆరెస్సెస్ వ్యాఖ్యలను శివసేన ఎద్దేవా చేసింది. ఇప్పుడు కేంద్రం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముందని, ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చు కదా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. అయోధ్య తీర్పుపై నిరసన మాత్రమే వ్యక్తం చేస్తామని చెప్పిన ఆరెస్సెస్ ఇప్పుడు హడావుడిగా ఉద్యమం చేస్తామని ప్రకటిస్తోందని హేళన చేసింది.
Comments
Please login to add a commentAdd a comment