విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోకుండా సీబీఎస్ఈ చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు.
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల నుంచి 2016-17 విద్యా సంవత్సరానికిగాను మొత్తం 60 దరఖాస్తులను సీబీఎస్ఈ స్వీకరించిందని కేంద్ర మానవ అభివద్ధి శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా చెప్పారు. ప్రాథమిక ప్రక్రియలో ఏ దరఖాస్తు కూడా పెండింగ్లో లేదని, అయితే, బై-చట్టాలకు అనుగుణంగా నిబంధనలు పాటించని పాఠశాలల దరఖాస్తులు మాత్రం పెండింగ్లో ఉంచినట్లు తెలిపారు.
రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సీబీఎస్‌ఈకి వచ్చిన స్కూల్ అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయని, వాటిని ఆమోదించడానికి సీబీఎస్ఈ ఎలాంటి చర్యలను తీసుకుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం రాజ్యసభలో ప్రశ్నించగా ఈ మేరకు కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. వెనుకబడిన ప్రాంతాలకు చెందిన పిల్లలు విద్యనందుకునేలా సాయపడాలని, విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోకుండా ఉండేందుకు సీబీఎస్ఈ చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కేంద్రమంత్రికి విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.